ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్‌గా మారారు. స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల విలువ భారీగా పెరగడంతో ఆయన సంపద ఒక్కరోజులోనే ఏకంగా 65 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో మస్క్ మొత్తం సంపద 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
అక్టోబర్ ప్రారంభం నుంచి స్పేస్‌ఎక్స్ షేర్లు సుమారు 13 శాతం పెరగగా.. టెస్లా షేర్లు 6.7 శాతం లాభపడ్డాయి. ఈ కంపెనీల్లో మస్క్‌కు ఉన్న వాటాల విలువ పెరగడం ఆయన సంపదపై నేరుగా ప్రభావం చూపింది.
గత మూడు నెలల్లో తొలిసారిగా మస్క్ సంపద 13 అంకెల స్థాయికి చేరింది. జూన్‌లో స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయిలో పబ్లిక్ ఆఫరింగ్ చేపట్టడంతో షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఆ సమయంలో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ నిలిచారు. అయితే ఆ తర్వాత కంపెనీ విలువపై ఆందోళనలు వ్యక్తం కావడంతో షేర్ల ధరలు తగ్గి, ఆయన సంపద కూడా గణనీయంగా పడిపోయింది.
జూలై చివరి నాటికి మస్క్ సంపద గరిష్ఠ స్థాయి నుంచి 600 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. ఈ మొత్తం బ్లూమ్‌బర్గ్ ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో ఇప్పటివరకు నమోదైన ఇతర వ్యక్తుల మొత్తం సంపద కంటే కూడా ఎక్కువగా ఉండటం విశేషం.
తాజా షేర్ల ర్యాలీకి స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థలపై మళ్లీ పెరిగిన పెట్టుబడిదారుల నమ్మకమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా రంగాల్లో స్పేస్‌ఎక్స్‌కు ఉన్న అవకాశాలపై ఆశావాదం పెరగడంతో ఆ కంపెనీ షేర్లు ఆగస్టు కనిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 58 శాతం పుంజుకున్నాయి.
మరోవైపు మస్క్ వ్యక్తిగత సంపదలో 98 శాతానికి పైగా స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల్లో ఆయనకు ఉన్న వాటాల ద్వారానే వస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంపద సూచీ పేర్కొంది. దీంతో ఈ రెండు కంపెనీల షేర్ల కదలికలు మస్క్ సంపదపై భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి.

