జేడీయూ మాజీ అధ్యక్షుడు, కేంద్రమాజీ మంత్రి శరద్ యాదవ్ ఇకలేరు. చాలాకలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఏడుసార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. గురువారం రాత్రి ఆయన నివాసంలో స్పృహ కొల్పోగా ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో 1947లో జన్మించారు. 1974లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారి మధ్యప్రదేశ్ లోని జబల్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏడుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
2003లో జేడీ-యూ తొలి జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2018లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని ఏర్పాటుచేసి తర్వాత దానిని ఆర్జేడీలో విలీనం చేశారు.
ఆయన మృతిపట్లు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి..