అర్బన్ ఫారెస్ట్ పార్కులు హైదరాబాద్‌కు మణిహారం..

155
- Advertisement -

దశల వారీగా మరో ముఫ్పై నాలుగు అర్బన్ ఫారెస్ట్ పార్కులు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి పురోగతిపై సంబంధిత శాఖలు, బాధ్యులైన అధికారులతో అరణ్య భవన్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వల్ల ఆలస్యం అయిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను వెంటనే పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. హెచ్.ఎం.డీ.ఏ పరిధిలో మొత్తం 59 పార్కులు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 18 పార్కులు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరో 34 వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా రానున్న మూడు నెలల్లో పూర్తి చేసి, దశల వారీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుతో పాటు, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిత్యం అర్బన్ పార్కుల పురోగతిపై ఆరా తీస్తున్నారని, పనుల్లో మరింత జాప్యం జరగకుండా ఏజెన్సీలతో పనులు పూర్తి చేయాలని శాంతి కుమారి ఆదేశించారు. ప్రతీ పార్కు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షిస్తూ, అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చారు. దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా హైదరాబాద్ చుట్టూ లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమికి పూర్తి రక్షణ కంచె నిర్మిస్తున్నామని, ప్రతీ అటవీ బ్లాక్‌లో జనావాసాలకు దగ్గరకు ఉన్న, కొద్ది అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. అటవీ శాఖతో పాటు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, అందుకే అర్బన్ ఫారెస్ట్ పార్కులు చరిత్రలో నిలిచిపోయేలా తయారవుతున్నాయని శాంతి కుమారి ప్రశంసించారు.

ఆయా పార్కుల ప్రత్యేకతలను, పనులు జరుగుతున్న విధానాన్ని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ సమావేశంలో వివరించారు. 34 పార్కుల్లో జనవరి నెలాఖరుకు 19, ఫిబ్రవరిలో 05, మార్చి కల్లా 09 పార్కుల్లో పనులు పూర్తి అవుతాయని, (ఇంకొక ఏడు పార్కుల నిర్మాణం వచ్చే ఏడాది చేపడతారు) అన్నిటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. అటవీ భూమి ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా కంచె వేయటంతో పాటు, అన్ని ప్రాంతాల్లో కన్జర్వేషన్ జోన్లను కూడా అభివృద్ది చేస్తున్నట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, సంబంధిత జిల్లాల అటవీ అధికారులు, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర రెడ్డి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీయే, మెట్రో రైల్, టీఎస్ఐఐసీ, ఫారెస్ట్ కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -