వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాటుతో పరుగుల వరద పారించేవాడు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తన ట్వీటుతో నవ్వుల వరద పారిస్తున్నాడు వీరు. వ్యక్తులెవరైనా.. సంధర్బం ఏదైనా.. తన పంచులతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు సెహ్వాగ్. ఆదివారం హర్యానాలోని రోహ్‌తక్‌లో ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ వివాహం ఘనంగా జరిగింది. ఆమె భర్త సత్యవర్త్ కూడా అంతర్జాతీయ స్థాయి రెజ్లరే. ఈ సందర్భంగా వారికి టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలుపుతూ.. వారి పెళ్లికి వెళ్లలేకపోయానని అన్నాడు. అందుకు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కారణమని చెప్పాడు. వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆయన అన్నాడు. ఇంట్లో మాత్రం ఈ రెజ్లింగ్ దంపతులు కుస్తీ పట్టకూడదని ఆటపట్టించాడు.
వీరేంద్ర సెహ్వాగ్ ఏప్రిల్ ఫూల్స్ డే సంధర్బంగా ట్విట్టర్ లో డొనాల్డ్ ట్రంప్ తర్వాత సెహ్వాగే అమెరికా అధ్యక్షుడంటూ న్యూయార్క్ టైమ్స్ కథనం రాసిందని సరదాగా ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ జర్నలిస్టు స్టీఫెన్ స్మిత్.. పత్రికలోని స్పోర్ట్స్ పేజీలో ఏమని పేర్కొన్నారంటే.. తరచూ అమెరికా వస్తున్న ట్విట్టర్ సూపర్‌స్టార్ వీరూతో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని అందులో పేర్కొన్నారు.