సీతాఫలం.. నోరూరించే ఓ మధురమైన పండు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ సీతాఫలానికి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. మంచి పోషక విలువలతో జీర్ణశక్తిని పెంచేందుకు ఉపయోగడపడే సీతాఫలం ఒకప్పుడు విరివిగా లభించేది. అయితే కాలానుక్రమంలో సీతాఫలం చెట్లు బాగా తగ్గిపోయాయి. పారిశ్రామికీకరణ, రియల్ ఎస్టేట్ బూమ్ వల్ల మెజారిటీ ప్రాంతాల్లో ఈ రకం చెట్లు అంతరించే దశకు చేరుకున్నాయి. సీజన్‌లో సీతాఫలం కోసం వెతుక్కునే పరిస్థితి వచ్చింది. గతంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు కూడా సీతాఫలాలు పెద్ద ఎత్తున వచ్చేవి, ఇప్పుడా పరిస్థితి లేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, అటవీ శాఖ చొరవతో తెలంగాణలో మళ్లీ సీతాఫలంకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సేకరించిన అటవీ భూమికి బదులుగా ప్రభుత్వం సుమారు 2653 హెక్టార్ల భూమిని ఏడు జిల్లాల పరిధిలో అటవీ శాఖకు అప్పగించింది. దీనిలో 2020 నుంచి ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేపట్టాల్సి ఉంది. కానీ అప్పటిదాకా ఆగకుండా ఈ యేడాది నాలుగో విడత హరితహారంలో భాగంగా ఈ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి అటవీ శాఖకు సూచించారు. తెలంగాణ ప్రాంతం భూములకు అనువుగా ఉండే చెట్లను మాత్రమే నాటాలని చెప్పారు. ప్రత్యామ్నాయ అటవీ పెంపకం కోసం కేటాయించిన భూములు మెజారిటీ కరీంనగర్ అటవీ సర్కిల్ అంటే సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. 1752 హెక్టార్ల భూమిని రెవెన్యూ శాఖ ఈ మూడు జిల్లాల్లో అటవీ శాఖకు అప్పగించింది. మొత్తం 34 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ భూముల్లో సుమారు రెండు లక్షల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ నడుంబిగించింది.
అంతేకాదు మొక్కలు నాటడం కంటే ముందే ఖచ్చితమైన రక్షణ చర్యలు, చైన్ లింక్ ఫెన్సింగ్ ఏర్పాటు, కందకాలు తవ్వకం ద్వారా జంతువులు, మనుషులు ఇష్టానుసారం ఈ భూముల్లోకి వెళ్లకుండా అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. వేప, రేల, నెమిలినార, టేకు మొక్కలను ఈ ప్రాంతాల్లో నాటుతున్నారు. అదే సమయంలో గతంలో ఈ ప్రాంతాల్లో విరివిగా పెరిగిన సీతాఫలం చెట్లపై కూడా అటవీ అధికారులు దృష్టి పెట్టారు. గతంలో స్థానికులకు మంచి ఆదాయ వనరుగా ఉన్న సీతాఫలం వనాలను పునరుద్ధరించాలని అటవీ శాఖ సంకల్పించింది. సిరిసిల్లలో మూడు, జగిత్యాల, పెద్దపల్లిల్లో ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసి హరితహారంలో భాగంగా కనీసం రెండు మీటర్లు ఉన్న సీతాఫలం మొక్కలను నాటుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో బోనాల, సారంపల్లి, తిమ్మాపూర్, బస్వాపూర్, దామన్నపేట గ్రామాలకు చెందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు అటవీశాఖ ప్రయత్నానికి మద్దతు తెలపటంతోపాటు స్వయంగాహరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముదిరాజ్ వర్గానికి చెందిన పూర్వీకులు ఈ ప్రాంతాల్లో గతంలో సీతాఫలం అమ్మకాల ద్వారా ఆదాయం పొందేవారు. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి సీతాఫలం వనాలను పెంచేందుకు ప్రాముఖ్యతను ఇవ్వటంపై స్థానికముదిరాజ్ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగేళ్లలో ఈ చెట్లు ఫలాలను ఇస్తాయని వారు చెబుతున్నారు. చెట్లను రక్షించుకుని, ఫలాలు పొందేందుకు తాము సిద్దం అంటున్నారు. ఈ ప్రాంతంలో లక్ష సీతాఫలం మొక్కలను నాటడం టార్గెట్ గా పెట్టుకున్న అటవీ శాఖ ఇప్పటికీ 47 వేల మొక్కలను పూర్తి రక్షణాత్మక చర్యలతో నాటింది. మిగతా వాటిని కూడా ఈ సీజన్ లోనే పూర్తి చేస్తామని కరీంనగర్ సర్కిల్ అదనపు అటవీ సంరక్షణ అధికారి మోహన్ చంద్ర పర్గేయిన్ చెప్పారు. భూ సార పరీక్షల నిర్వహణ తర్వాత పూర్తి ఆధునిక పద్దతులు, రక్షణ చర్యలతో మొక్కలు నాటుతుండటం, అటవీశాఖ అధికారులు, సిబ్బంది కూడా పూర్తి స్ధాయిలో నిమగ్నం అవుతుండటంతో సీతాఫలం ఫలాలు త్వరలోనే అందే అవకాశముంది.