ఢిల్లీలోని సుప్రీంకోర్టు పరిసరాల్లో శాంతియుతంగా నిరసన తెలిపిన పలువురు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) స్పందించింది. ఈ వ్యవహారంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. నిరసనకారులపై పోలీసులు అధిక బలప్రయోగం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఎస్సీబీఏ గౌరవ కార్యదర్శి ప్రజ్ఞా బగేల్ శనివారం సీజేఐకి రాసిన లేఖలో.. నిరసనల్లో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. నిర్బంధంలో ఉన్న ప్రతి న్యాయవాది ఆచూకీ, భద్రతను నిర్ధారించాలని, వారికి న్యాయ సహాయం అందేలా చూడాలని కోరారు. చట్టబద్ధమైన కారణాలు లేని వారిని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
న్యాయవాదులపై జరిగినట్లు చెబుతున్న బలప్రయోగం, నిర్బంధానికి సంబంధించిన పరిస్థితులపై సమగ్రంగా పరిశీలన జరపాలని ఎస్సీబీఏ కోరింది. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అసోసియేషన్ తీర్మానం కూడా చేసింది.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ నిరసన చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.
Also Read:మాజీ సీఎం విజయన్‌కు షాక్
ఈ వ్యవహారంపై ఎస్సీబీఏతోపాటు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (SCAORA), సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం జస్టిస్ సూర్యకాంత్ సంబంధిత అధికారులతో మాట్లాడారని, అదుపులోకి తీసుకున్న న్యాయవాదులను విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.

