స్పాట్ ఫిక్సింగ్ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్‌కు ఊరట లభించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అతనిపై నిషేధాన్ని సుప్రీం కోర్టు ఈ రోజు ఎత్తేసింది. బీసీసీఐ అతనిపై విధించిన జీవితకాల నిషేధం మరీ దారుణంగా ఉందని కోర్టు పేర్కొంది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ కేసును విచారించింది. శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగాను శ్రీశాంత్ జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తనకు అసలు ఏ శిక్షా విధించవద్దన్న శ్రీశాంత్ అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. అతనిపై జీవితకాల నిషేధం కాకుండా మరేదైనా శిక్ష విధించాలని, దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. శిక్షపై అతని వాదన కూడా కమిటీ వినాలని అశోక్ భూషణ్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
2017, అక్టోబర్‌లో బీసీసీఐ పిటిషన్ మేరకు శ్రీశాంత్‌పై కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ మరోసారి జీవితకాల నిషేధాన్ని విధించింది. అంతకుముందు సింగిల్ జడ్జి అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయగా.. బీసీసీఐ దీనిని సవాలు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో 2013, మేలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అయిన శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురినీ బీసీసీఐ నిషేధించింది.
తాజాగా ఈ విషయంపై శ్రీశాంత్ స్పందిస్తూ… తాను 30 ఏళ్ల వయసులో ఇంకా ఫిట్‌నెస్‌గా ఉన్నాడని, బీసీసీఐపై తనకు నమ్మకముందని చెప్పాడు. బీసీసీఐ అధికారులు తనపై నిషేధాన్ని ఎత్తివేస్తే మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు.