నీట్ పరీక్షలను నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్థానంలో స్వయంప్రతిపత్తి గల మరొక సంస్థను తీసుకురావాలని, లేదా నీట్‌ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) ఫార్మాట్‌కు మార్చాలని కోరుతూ వివిధ పక్షాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్ట్ విచారణ జరిపింది.
నీట్ (NEET) వైద్య ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి ఎన్టీఏ (NTA) స్థానంలో ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ల నుండి వివరణ కోరింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ మరియు జస్టిస్ ఆలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షా విధానం మరియు భద్రతా వ్యవస్థపై విస్తృత సమీక్ష జరపాలని ఈ పిటిషన్లలో కోరారు. నీట్-యుజి (NEET-UG) 2026 పరీక్షకు సంబంధించిన లీకేజీ పిటిషన్లపై కేంద్రానికి, విద్యా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. గతంలో జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనల నుండి అధికారులు ఎలాంటి “పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరం” అని వ్యాఖ్యానించింది. అలాగే, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన మానిటరింగ్ కమిటీ (పర్యవేక్షణ కమిటీ) ఏమైందో చెప్పాలని ఎన్టీఏను కోర్టు ప్రశ్నించింది.
మేము కేవలం పరీక్ష గురించి మాట్లాడటం లేదు. వారు గత తప్పుల నుండి ఇంకా పాఠాలు నేర్చుకోకపోవడం చాలా విచారకరం. మేము గతంలో ఒక ఆదేశాన్ని జారీ చేశాము, ఒక కమిటీ ఏర్పాటైంది, అది కొన్ని సిఫార్సులు చేసింది మరియు వాటిని ఆమోదించారు కూడా. ఒక మానిటరింగ్ కమిటీ కూడా అక్కడ ఉంది అన్నారు సుప్రీం కోర్టు ధర్మాసనం.
2024 నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత కోర్టు నియమించిన మానిటరింగ్ కమిటీ చేసిన సిఫార్సులను ఎలా అమలు చేశారో వివరిస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్ట్ ఎన్టీఏను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 29కి వాయిదా వేశారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) మరియు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (UDF) తమ పిటిషన్‌లో ఎన్టీఏను మార్చాలని లేదా పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని, పరీక్ష నిర్వహణ కోసం మరింత సురక్షితమైన, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read:కేకేఆర్ ఆటగాళ్లపై రహానే ప్రశంసలు

