జూన్ 21న జరగబోయే నీట్-యుజి (NEET-UG) పునఃపరీక్షను ప్రస్తుత పెన్-అండ్-పేపర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఆదేశించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇటీవల జరిగిన పేపర్ లీక్ మరియు పరీక్ష రద్దు తదనంతర పరిణామాలతో ఎన్‌టీఏ ఇప్పటికే సతమతమవుతున్న తరుణంలో, ఈ దశలో పరీక్షా విధానాన్ని మార్చడం వల్ల అనేక ఆచరణాత్మక ఇబ్బందులు ఎదురవుతాయని కోర్టు పేర్కొంది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను జూలై నెలకు వాయిదా వేసింది. దీనితో జూన్ 21న జరగబోయే రీ-టెస్ట్ సాంప్రదాయ పెన్-అండ్-పేపర్ మోడ్‌లోనే జరగడానికి మార్గం సుగమమైంది. పరీక్షా అధికారులపై ప్రస్తుతం ఉన్న పనిభారాన్ని, ఒత్తిడిని ప్రస్తావిస్తూ… ఈ సమయంలో తక్షణ మార్పులు సాధ్యం కాదని స్పష్టం చేసింది. వెకేషన్ (కోర్టు సెలవులు) ముగిసిన తర్వాత జూలైలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.
గతంలో జరిగిన విచారణలో నీట్-యుజి పరీక్ష రద్దుపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు విద్యార్థులకు మరియు వారి కుటుంబాలకు తీవ్ర మానసిక క్షోభ కలిగించాయని కోర్టు అభివర్ణించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ తీసుకుంటున్న చర్యలపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. “నిజమైన జవాబుదారీతనం వచ్చే వరకు అసలు సమస్య ఆగదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్‌టీఏ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం… ప్రస్తుతం ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రధాన పరీక్షల్లో నీట్-యుజి మాత్రమే పెన్-అండ్-పేపర్ మోడ్‌లో జరుగుతోంది. నీట్-యుజి వివాదం తర్వాత ఏర్పాటైన నిపుణుల కమిటీ కూడా ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత ఫార్మాట్ (CBT) లోకి మార్చాలని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, ప్రస్తుత పరీక్షా చక్రం ముగిసిన తర్వాత దీనిపై చర్చించనున్నట్లు ఎన్‌టీఏ కోర్టుకు తెలిపింది. మే 12న పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దయిన నీట్ పరీక్షకు సంబంధించిన సిబిఐ (CBI) దర్యాప్తు కొనసాగుతుండగానే, జూన్ 21న పునఃపరీక్ష జరగనుంది.
Also Read;టాలీవుడ్‌పై జాన్వీ ఇంట్రెస్టింగ్!

