దేశంలో నీటి వనరుల సమర్థవంతమైన నిర్వహణ కోసం ఉపగ్రహ సాంకేతికత, అంతరిక్ష ఆధారిత అనువర్తనాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సోమవారం అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి. ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ వర్క్‌షాప్‌లో ఈ ఒప్పందం కుదిరింది.
ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం జలవనరుల శాఖ మరియు ఇస్రో సంయుక్తంగా 24 కీలక పరిశోధనా రంగాలలో కలిసి పనిచేస్తాయి. ఇందులో జలాశయాల పర్యవేక్షణ, నదీ ప్రవాహ విశ్లేషణ, ఉపగ్రహ ఆధారిత నీటి నాణ్యత అంచనా మరియు నీటి వనరులలో మ్యాక్రోప్లాస్టిక్ విస్తరణపై అధ్యయనాలు వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ మాట్లాడుతూ…2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో నీటి భద్రత అత్యంత కీలకమైన పునాది అని పేర్కొన్నారు. నీటి సవాళ్లను సాంకేతికత, ఆవిష్కరణలు మరియు ప్రజల భాగస్వామ్యంతో ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే వేదికపై ఆయన జల సంచయ్ జన భాగీదారీ ప్రచారం మూడో దశను ప్రారంభిస్తూ.. జూన్ 2026 నుండి మే 2027 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రెండు కోట్ల నీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.
ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ…అంతరిక్ష సాంకేతికత ప్రస్తుతం నీటి వనరులను గమనించడానికి మరియు వరదలను అంచనా వేయడానికి అపూర్వమైన సామర్థ్యాన్ని అందిస్తోందని, ఈ భాగస్వామ్యం భూగర్భ జలాల అంచనా వంటి రంగాలలో పరిశోధనలకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.
Also Read:టాలీవుడ్‌పై జాన్వీ ఇంట్రెస్టింగ్!

