అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం “సవ్యసాచి” . చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతోంది. మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండగా.. జూన్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలుగులో మాధవన్ చేస్తున్న తొలి స్ట్రెయిట్ మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో మాధవన్ నటించిన సఖి,చెలి సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. అంతేగాదు ఈ రెండు సినిమాలకు జాతీయ స్ధాయిలో గుర్తింపువచ్చింది. ఈ మేరకు ఓ లెటర్ విడుదల చేసిన చిత్రయూనిట్…సినిమాలో నటించినందుకు మాధవన్‌కు థ్యాంక్స్ తెలిపింది.
మీ అద్భుతమైన నటన చూసి చిత్ర యూనిటంతా మీకు అభిమానులం అయిపోయారు. మీలాంటి నటుడిని టాలీవుడ్‌కి నేరుగా పరిచయం చేసే అదృష్టం మాకే దక్కడం చాలా సంతోషంగా ఉంది. మీరు మా సినిమా ఒప్పుకోవడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్టే అంటూ కొనియాడింది సవ్యసాచి చిత్ర యూనిట్. తమిళనాట స్టార్ హీరోగా పేరున్న మాధవన్ నేరుగా తెలుగు సినిమాలో నటించడం మాత్రమే ఇదే తొలిసారి.
ఇక ఈ సినిమాలో నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు’ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసిన ఈ సాంగ్ ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారట. ఇందుకోసం సొట్టబుగ్గల సుందరి రకుల్‌ను సంప్రదిస్తున్నారట. రకుల్ కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవరాల్‌గా విడుదలకు ముందే సినిమాపై అంచానలు పెరిగిపోయాయి.