సౌదీ అరేబియాలో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తప్పు చేసినవారు ఎంతటి వారైనా.. శిక్ష తప్పదని రుజువు చేశాయి ఆ దేశ చట్టాలు. ఓ వ్యక్తిని హత్య చేశాడన్న ఆరోపణలు రుజువవడంతో ఏకంగా ఆ దేశ యువరాజుకే మరణశిక్షను అమలు చేసింది సౌదీ అరేబియా. ఆదెల్ మహెమిద్ అనే వ్యక్తిని కాల్చి చంపినందుకు యువరాజు తుర్కి బిన్ సౌద్ అల్ కబీర్‌కు మరణశిక్ష అమలు చేసినట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. యువరాజుతో కలిపి ఇప్పటివరకు ఈ ఏడాది మొత్తం 134 మందికి మరణశిక్ష అమలు చేసింది సౌదీ ప్రభుత్వం.
2012లో రియాద్ శివారులోని ఓ క్యాంప్‌లో జరిగిన ఘర్షణలో అదెల్ అల్ మహెమిద్ అనే వ్యక్తిని సౌదీ రాకుమారుడు టుర్కీ బిన్ సౌద్ అల్-కబీర్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో కబీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదెల్‌ను కబీర్ హత్య చేసినట్లు 2014లో రియాద్ కోర్టు నిర్ధారించి మరణశిక్ష విధించింది. దీంతో బుధవారం అతడికి శిక్ష అమలుచేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
2015లోనూ 158 మందికి ఈ దేశంలో మరణశిక్ష అమలు చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలోనే మరణశిక్షలు విధిస్తున్నారు. వీరిలో ఒక్క జనవరి నెలలోనే ఉగ్రవాదం ఆరోపణల కింద 47మందికి మరణశిక్ష అమలుచేశారు.న్యాయవ్యవస్థ పారదర్శకంగానే ఉన్నా.. పెరిగిపోతున్న మరణశిక్షలపై అక్కడి హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
యువరాజుకే మరణశిక్ష అమలు చేయడాన్ని చూస్తే సౌదీలో న్యాయవ్యవస్థ ఎంత పారదర్శకంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చని బాధిత వ్యక్తి బంధువు అబ్దుల్ రెహమాన్ అన్నాడు. సౌదీలో ఎక్కువశాతం తలను ఖండించి మరణశిక్ష అమలు చేస్తారు.