పదో తరగతి పరీక్షలపై సత్యవతి రాథోడ్ సమీక్ష

306
sathyavathi rathod
- Advertisement -

కోవిడ్-19 కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8వ తేదీ నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్భందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ – కరోనా వైరస్ కట్టడి చర్యలపై నేడు హైదరాబాద్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తులతో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు సమీక్ష చేశారు.

కరోనా వైరస్ కట్టడి కోసం వాయిదా పడిన పరీక్షలు తిరిగి నిర్వహించనున్న సందర్భంగా రివైస్డ్ సిలబస్ మేరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు మంత్రికి తెలిపారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలోని విద్యాలయాల్లో 2949 మంది విద్యార్థులున్నారని, అన్ని జిల్లాలో వీరికోసం 38 కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు.

కరోనా వైరస్ కనపడకుండా విజృంభిస్తున్న సందర్భంగా పరీక్షల కోసం వచ్చే విద్యార్థుల ఆరోగ్యం పట్ల అధికారులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సూచించారు. జూన్ 08వ తేదీ నుంచి పరీక్షలు ఉన్నందున వారం రోజుల ముందే వసతి గృహాలకు విద్యార్థులు చేరుకునేటట్లు చూడాలని, వసతి గృహానికి వచ్చే ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారం రోజుల పాటు వారిని పరిశీలించాలన్నారు. రోగ నిరోధకత పెంచే పోషకాహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.

వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు విధిగా రెండు మాస్క్ లు, ఒక సానిటైజర్ అందించాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునే సమయంలో కూడా భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వచ్చే విద్యార్థులకు సహకరించేందుకు సంబంధిత సబ్జెక్ట్ టీచర్లు కూడా జూన్ 1వ తేదీ నుంచి విధులకు హాజరు కావాలన్నారు.

పరీక్ష రోజు వసతి గృహాల నుంచి పరీక్షా కేంద్రాల వరకు విద్యార్థులను టీచర్లు, అధికారులు దగ్గరుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహానాల్లో తీసుకెళ్లాలన్నారు. మాస్క్ లేకుండా విద్యార్థులు, సిబ్బందిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది ఉండదని, దీనికోసం అందరూ ముందస్తుంగా మాస్క్ లు పెట్టుకోవాలన్నారు.
పరీక్షల కోసం వచ్చి, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల విషయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, ఇందులో నిర్లక్ష్యానికి ఎలాంటి తావు ఇవ్వకూడదని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు.

వసతి గృహాల్లో, పరీక్షా కేంద్రాల్లోనూ సానిటైజర్, మాస్క్ లేకుండా ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని ఆదేశించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం స్థానిక హెల్త్ సెంటర్ తో సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ కేంద్ర కార్యాలయం నుంచి పనిచేస్తున్న పినాకి హెల్త్ కమాండ్ సెంటర్ సేవలు సిబ్బంది, అధికారులు వినియోగించుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు.

- Advertisement -