సాయిరాం శంకర్, శరత్ కుమార్, రేష్మీ మీనన్ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం “నేనోరకం“. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో దీపా శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలకపాత్రలో నటించిన తమిళ స్టార్ హీరో శరత్‌కుమార్‌తో ఇంటర్వ్యూ….
– కెరీర్ ప్రారంభంలో కెప్టెన్ అనే సినిమా తెలుగు, తమిళంలో రూపొందింది. తర్వాత తెలుగులో గ్యాంగ్ లీడర్, స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్ సహా పలు చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించాను. తమిళంలో హీరోగా మారిన తర్వాత తెలుగులోకి అనువాదమైన మండే సూర్యడు పెద్ద సక్సెస్ సాధించింది. తమిళంలో బిజీ హీరో అయిన తెలుగులో మంచి పాత్రలు వచ్చినప్పుడు చేస్తూనే ఉన్నాను. తప్ప గ్యాప్ తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు నన్నెప్పుడూ బాగానే రిసీవ్ చేసుకున్నారు. `నేనో రకం` వంటి డిఫరెంట్ కథలతో ఎవరూ వచ్చినా నేను సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉంటాను.
నాకు నచ్చిన పాయింట్ అదే…
– నేనోరకం సినిమా కథను డైరెక్టర్ సుదర్శన్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. మంచి ఎమోషన్స్‌తో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉన్న చిత్రంగా భావించాను. ఆ పాయింట్ నచ్చడంతోనే నేనోరకం సినిమా చేయడానికి రెడీ అయ్యాను. అలాగే సాయిరాం శంకర్ క్యారెక్టర్‌ను అయినా, నా క్యారెక్టర్ అయినా దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగా నచ్చింది. ఇప్పటి యువతను ఉద్దేశించి మంచి మెసేజ్‌తో చేసిన సినిమా. ప్రేమంటే ఏంటి? నిజమైన ప్రేమేంటి? తల్లిదండ్రుల పేమ..అనేక విషయాలను ఈ సినిమాలో చెప్పాం.
అలాంటి సబ్జెక్ట్ వస్తే చేస్తాను….
– తమిళంలో తనీ ఒరువన్..తెలుగులో ధృవ సినిమాలో అరవింద్‌స్వామి విలన్‌గా నటించాడు. అరవింద స్వామి ఎంత విలన్ అయినా చివరకు చిన్న పాజిటివ్ టచ్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు విలన్‌గా అయినా చేయడానికి నేను సిద్ధమే.శరత్‌కుమార్ ఈ క్యారెక్టర్లో ఉంటే బావుంటుందని నా వద్దకు వచ్చి, కథ నాకు నచ్చితే నేను ఎప్పుడూ సిద్ధమే. నేను ఇప్పటి 140 సినిమాలకు పైగా నటించాను. చాలా డిఫరెంట్ పాత్రలు చేశాను. కొత్తగా ఏదైనా చేయాలనిపిస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ చూస్తే ఆయన డిఫరెంట్ పాత్రల్లో నటిస్తుంటారు. ఆయనలా కొత్త పాత్రల్లో నటించాలని ఉంది.
చిరు నాకు స్పెషల్…
– తెలుగు ఇండస్ట్రీలో అందరితో చాలా క్లోజ్‌గా ఉంటాను. సుహాసిని స్టార్ట్ చేసిన 80 అనే గ్రూప్ వల్ల అందరి మధ్య ఇంకా మంచి రిలేషన్ ఏర్పడింది. అయితే చిరంజీవితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ప్రత్యేకానుంబంధం ఎందుకంటే..నేను కొన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవిని హీరోగా పెట్టి ఓ సినిమా చేయాలనుకుని, ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిశాను. ఆయనకు అసలు విషయం చెప్పగానే..దీనికి ఇంత దూరం రావాలరా..అన్నారు. మీ రెమ్యునరేషన్ ఎంతండి అని అంటే..నాకు నువ్వు రెమ్యునరేషన్ ఇస్తావా రా..అనడమే కాకుండా నువ్వు నన్ను హెల్ప్ అడిగావ్..ముందు సినిమా చెయ్..తర్వాత అన్నీ చూసుకుందాం..అన్నారు. అప్పుడు ఆయన అన్నమాటలను నేనింకా మరచిపోలేను. అందుకే నాకు చిరంజీవి ఎప్పుడూ స్పెషలే. కానీ తర్వాత నేను పెద్ద హీరో అవుతానని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పినట్లు నేను పెద్ద హీరోగా మారిపోయాను. తర్వాత చిరంజీవితో సినిమా చేయలేకపోయాను. అలాగే ఇప్పుడు చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150లో ఓ చిన్న సీన్లో అయినా నటిస్తానని కూడా చిరంజీవిగతో, వినాయక్‌తో అన్నాను. కానీ కుదరలేదు. ఆయనతో అవకాశం వస్తే తప్పకుండా నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే.
సాయిరాం శంకర్ నటన గురించి…
– నేనో రకం సినిమాలో సాయిరాం శంకర్ పాత్ర చాలా బాగా డిజైన్ చేశారు. అందుకు తగ్గట్లే సాయిరాం శంకర్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సీనియర్ యాక్టర్ అయన నాతో పోటీ పడి నటించాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంది.
అందుకే ఫిట్‌గా ఉంటాను…
– నేను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం నా అలవాట్లే కారణం. నేను వేళకు నియమిత ఆహారాన్ని తీసుకుంటాను. ప్రతిరోజు గంట నుండి గంటన్నరపాటు వ్యాయామం చేస్తాను. మద్యం తీసుకోను.
దర్శకత్వం చేయడానికి సమయం లేదు…
– నేను నటించిన నా వందవ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాను. అయితే దర్శకత్వం అంత సులభం కాదు. అన్నీ క్రాఫ్ట్స్‌ను దగ్గరుండి చూసుకోవాలి. అందు కోసం మినిమమ్ ఆరు నెలలు సమయం పడుతుంది. ప్రస్తుతం అంత సమయం లేదు.
వాడొక నీచుడు…
– మా అమ్మాయి వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకడి గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో స్త్రీలకు ఎదురవుతున్న సిచ్యువేషన్సే కారణం. అయితే వరలక్ష్మిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి, వరలక్ష్మికి బాగా తెలిసిన వ్యక్తి, శరత్‌కుమార్ కుమార్తె అని తెలిసినా ఇబ్బంది పెట్టాడంటే వాడెంత నీచుడో తెలుస్తూనే ఉంది. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.
అందరిలో మార్పు రావాలి…
– పైరసీ నశించాలంటే ఒక న్యాయవవ్యస్థతోనో, పోలీసుల ద్వారానో వీలు కాదు. అందరిలో మార్పు రావాలి. అందరూ పైరేటెడ్ సీడీల్లో సినిమాలు చూడకూడదని గట్టి నిర్ణయం తీసుకోవాలి.
చేయబోతున్న చిత్రాలు గురించి…
– రాడాన్ పిక్చర్స్ బ్యానర్లో సినిమాలేవీ చేయడం లేదు. అయితే మారి మరో బ్యానర్ అయిన ఐ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థలో సినిమాలను నిర్మిస్తున్నాం. ఈ బ్యానర్లో విజయ్ ఆంటోనితో ఓ సినిమాను, జీవీ ప్రకాష్‌తో ఓ సినిమా చేస్తున్నాం. ఇవి కాకుండా నేనొక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాను.