నందమూరి హరికృష్ణ హఠాన్మరణం సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఆయన మరణ వార్త విని ఆయన అభిమానులు, సన్నిహితులు ఆయనకు అశృనివాళులర్పించి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం హరికృష్ణ కుమారుడు జానకి రామ్ మరణం తో ఏర్పడిన కన్నీటి ఛాయలు, మళ్ళీ హరికృష్ణ మరణం తో ఆయన కుటుంబాన్ని కమ్మివేసాయి. అయితే విధి ఆడిన వింత నాటకమో , చేదు జ్ఞాపకం గా మారిన యాధృచ్చికమో తెలియదుగానీ, జానకి రామ్ మరణం లో, హరికృష్ణ మరణంలో చాలా అంశాలు ఒకే పోలికతో ఉండటం నందమూరి వంశాన్ని , వారి అభిమానుల్ని కలవరపెడుతోంది.
నాలుగు సంవత్సరాల క్రితం నందమూరి జానకి రామ్ కూడా కారు ప్రమాదం లోనే మరణించాడు. ఆ సమయం లో కార్ డ్రైవ్ చేసింది కూడా ఆయనే. ఇప్పుడు హరికృష్ణ కూడా కార్ డ్రైవ్ చేస్తూనే మరణించడం ఆశ్యర్యకరం. వీరిద్దరూ నల్గొండ జిల్లా పరిధిలోనే ప్రమాదానికి గురయ్యారు. అదికూడా హైదరాబాద్ – విజయవాడ రహదారిపైనే కావడం గమనార్హం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరిద్దరి వాహనాలు వేరు వేరైనా, వారి వాహనాల నంబర్లు మాత్రం 2323తోనే ఉండడం అందరినీ నివ్వెరపరుస్తున్నాయ్.
హరికృష్ణ నడుపుతున్న కారు నంబర్ AP 28 BW 2323 కాగా.. జానకీరామ్ నడిపిన కారు నంబర్ AP 29BD 2323. ఇలా ఒకే రకం ప్రమాదాలను ఎదుర్కున్న వీరిద్దరి మరణం నందమూరి కుటుంబ సభ్యులను కలవరపరుస్తోంది. జానకి రామ్ మరణించిన కొంతకాలం లోనే హరికృష్ణ కూడా మరణించడం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చిందనే చెప్పాలి.