2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 181 సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివపాల్ సింగ్ పటేల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 50 నుంచి 65 సీట్లు మాత్రమే కేటాయించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్తో మాట్లాడిన శివపాల్ సింగ్ పటేల్.. కాంగ్రెస్ పార్టీ తాము పోటీ చేయాలనుకుంటున్న 181 స్థానాలతో కూడిన జాబితాను సమాజ్‌వాదీ పార్టీకి అందించిందని తెలిపారు. అయితే సీట్ల పంపకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌దే తుది నిర్ణయమని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ 50-60 సీట్లకు అంగీకరించాలని, గరిష్ఠంగా 65 స్థానాల వరకు కేటాయించే అవకాశం ఉందని పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, సమాజ్‌వాదీ పార్టీకి మాత్రం బలమైన ప్రాతినిధ్యం ఉందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ 181 సీట్లు కోరడం సమంజసం కాదన్నారు. వాస్తవానికి ఆ పార్టీకి 50 సీట్లు కూడా కేటాయించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
సీట్ల పంపకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తల కృషిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని శివపాల్ సింగ్ పటేల్ సూచించారు. పీడీఏ (వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు) పంచాయతీల ద్వారా ప్రజల్లోకి వెళ్లి సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయిస్తే పార్టీ కేడర్‌లో అసంతృప్తి ఏర్పడి, వారి మనోధైర్యం దెబ్బతింటుందని హెచ్చరించారు.
Also Read:తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్..
రాష్ట్రంలో ప్రజల మద్దతు అఖిలేశ్ యాదవ్ పాలన, సంక్షేమ కార్యక్రమాల వైపే ఉందని ఆయన పేర్కొన్నారు. పొత్తుల్లో పరస్పర సహకారం అవసరమేనని, అయితే హద్దులు దాటి సీట్లు కేటాయించడం ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.

