అమెరికాలో విమాన ప్రయాణాల అంతరాయం ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 6,150కు పైగా విమానాలు రద్దు కాగా, మరో 7,300కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ఆదివారం కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నవంబర్ 15, ఆదివారం నాటికి కూడా అమెరికా విమానయాన రంగం సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. FAA ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. విమానాల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎయిర్లైన్స్ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
FAA చీఫ్ బ్రయాన్ బెడ్ఫోర్డ్ శనివారం మాట్లాడుతూ.. విమాన సర్వీసులు ఆదివారం అర్ధరాత్రి సమయానికి కానీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని తెలిపారు. వ్యవస్థలోని సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
విమానాల ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. శనివారం సాయంత్రం 6.45 గంటల ET (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.15 గంటలు) నాటికి అమెరికా వ్యాప్తంగా 6,150కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 7,300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. శుక్రవారం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ రోజు సుమారు 9,200 విమానాలు రద్దు కాగా, మరో 7,500 విమానాలు ఆలస్యమయ్యాయి. ఇక ఆదివారం నడవాల్సిన విమానాల్లోనూ శనివారం సాయంత్రానికే 530కి పైగా రద్దయ్యాయి.
Also Read:తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా బి.ఎం. సందీప్..
విమాన సర్వీసుల అంతరాయంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు FAA చీఫ్ బ్రయాన్ బెడ్ఫోర్డ్ క్షమాపణలు చెప్పారు. అమెరికా విమానయాన వ్యవస్థ సురక్షితంగానే ఉందని, కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని భరోసా ఇచ్చారు. ఆదివారం చివరి నాటికి విమాన సర్వీసులు చాలావరకు పునరుద్ధరించే అవకాశం ఉందని వెల్లడించారు.

