మైక్ కట్ చేశారని స్టేజీపైనే ఎమ్మెల్యే వీరంగం

3
- Advertisement -

ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధి సహనం కోల్పోయి బహిరంగ సభలో వీరంగం సృష్టించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రసంగిస్తుండగా మైక్ కట్ చేశారని ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హల్‌చల్ చేశారు. సౌండ్ సిస్టమ్ ఆపరేటర్లపై దాడి చేయడంతో పాటు వేదికపై ఉన్న పోడియంను కిందపడేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హాజరైన ఓ బహిరంగ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే సభలో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా మైక్ పనిచేయకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

దీంతో సహనం కోల్పోయిన హరీష్ ధామీ సౌండ్ సిస్టమ్ నిర్వహిస్తున్న ఆపరేటర్లపై చేయి చేసుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా వేదికపై ఉన్న పోడియంను సైతం కిందపడేశారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే ఈ ఘటన జరగడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ పరిణామాలతో సభా ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి, ఇలా దాడులకు దిగడం ఏమిటంటూ హరీష్ ధామీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైక్ కట్ కావడంపై అభ్యంతరం ఉంటే నిర్వాహకులతో మాట్లాడి పరిష్కరించుకోవచ్చని, బహిరంగ సభలో ఇలా ప్రవర్తించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read:తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్..

- Advertisement -