సైదిరెడ్డికి వచ్చిన మెజారిటీ ఎవ్వరికీ రాలేదు..

262
saidi reddy win
- Advertisement -

హుజూర్‌నగర్ ఎమ్మెల్యే గా ఎన్నికైన శానంపూడి సైదిరెడ్డికి అభినందనలు తెలిపారు గడ్డం ప్రసాద్. హుజూర్‌నగర్ పాత నియోజకవర్గం(అంటే1952 నుండి 1972 ఎన్నికల వరకు )లో కానీ ఆ తరువాత మిర్యాలగూడ నియోజకవర్గం(1977 నుండి 2004 ఎన్నికల వరకు )లో కానీ 2009లో పునరుథ్తానమైన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో కానీ ఇప్పటి వరకు నేడు సైదిరెడ్డికి వచ్చినంత మెజారిటీ (43284)ఎవ్వరికీ రాలేదు. అలాగే పాత నియోజకవర్గంలో మొదటిసారి గెలిచిన జయసూర్య, ఆయన రాజీనామా దరిమిలా జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన మఖ్దూమ్ తప్ప 1972 వరకూ జరిగిన ఎన్నికల్లో గెలిచిన దొడ్డా నర్సయ్య, అక్కిరాజు వాసుదేవ రావు, కీసర జితెందర్ రెడ్డి లే స్థానికులు.

1977 నాటికి హుజూర్‌నగర్ అంతర్ధానమై మిర్యాలగూడలో కలిసాక 2009వరకు గెలిచిన వారిలో అరిబండి లక్ష్మీనారాయణ ఒక్కరే నేటి హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని వారు. 2009లో మళ్ళీ హుజూర్‌నగర్ నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్నికలలో (నేటి ఉపఎన్నికతో కలిపి ) నేడు విజయం సాధించిన సైదిరెడ్డే స్థానికుడు. అంటే అరిబండి(ఈయన చివరగా 1985 ఎన్నికల్లో గెలిచారు ) తరువాత 34 ఏళ్లకు హుజూర్‌నగర్ నుండి ఒక స్థానికుడు అది కూడా భారీ మెజారిటీతో గెలిచాడన్నమాట. ఇది అందరూ సంతోషించాల్సిన విషయం. అంతే కాదు అక్కిరాజు వాసుదేవరావు 1967లో గెలిచిన తరువాత 52 ఏళ్లకు హుజూర్‌నగర్ స్థానికుడు ఒకరు అధికారపక్షం అభ్యర్థిగా విజయం సాధించటాన్ని అంతా హర్షించాలసిందే.

అధికార పక్షం అభ్యర్థులుగా మిర్యాలగూడలో ఉన్నపుడు తిప్పన విజయసింహా రెడ్డి (1989)గెలిచినా 2009లో హుజూర్‌నగర్ నుండి ఉత్తమ్ రెడ్డి గెలిచినా వారు స్థానికేతరులే. వీరందరిలో వాసుదేవరావు, ఉత్తమ్ రెడ్డి హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మాటను అంతా అంగీకరించాలసిందే. హుజూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ మాత్రం జితెందర్ రెడ్డి ఎమ్మెల్యే గా ఉండగా కె వి రెడ్డి, కోట నారాయణ, చింతలపూడి రాములు, పశ్య రాంరెడ్డి తదితర (క్షమించాలి, అందరి పేర్లు గుర్తు లేవు ) పెద్దల కృషి తో వచ్చింది. వాసుదేవరావు, ఉత్తమ్ రెడ్డిల అభివృద్ధి ఒరవడిని సైదిరెడ్డి అందుకుని నియోజకవర్గాన్ని అప్రతిహతంగా అభివృద్ధి బాటలో పయనింప చేస్తారని విశ్వసిస్తూ ప్రజల మన్నన పొందాలని ఆశిద్దాం.

చివరగా ఒక్క మాట ఎవరైనా ప్రజామన్నన ఉన్నంతకాలమే నాయకునిగా కొనసాగుతారు. ఇందుకు ఒకటే మార్గం. ఎంత ఎదిగినా, అభివృద్ధి చేసినా నియోజకవర్గ ప్రజలపట్ల వినయ విధేయతలతో సభ్యతా సంస్కారాలతో ఒదిగి ఉండటమే. ఇంతకు మించిన మార్గం లేదుగాక లేదు. మహామహులమనుకుని ఈ దారి తప్పి చీత్కారాలకు తిరస్కారాలకు గురైన వారెందరో మనకళ్లముందే ఉన్నారు. కనుక సైదిరెడ్డీ మంచి మర్యాద మన్ననను, నడత నడవడికను దిద్దుకో నేర్చుకో. నీకూ మాకూ అంతా శుభం జరగాలని కోరుకుంటున్నాము అన్నారు గడ్డం ప్రసాద్.

- Advertisement -