హుజుర్‌నగర్ ప్రజలకు కృతజ్ఞతలు- సీఎం కేసీఆర్

526
kcr
- Advertisement -

హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విజయం అనంతరం సీఎం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ప్రతీకూల వాతావరణ పరిస్థితుల్లో నేను వెళ్లలేకపోయినప్పటికీ కూడా ప్రజలు అద్భుత మెజార్టీ ఇచ్చారు. ఇది ఏదో ఆశామాషీగా అలవోకగా వేసిన వేటు అనుకోవటం లేదు. చాలా ఆలోచన చేసి వేసినట్లుగా భావిస్తున్నాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలంలో జరిగినటువంటి ఉపఎన్నిక ఇది. పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఈ విజయం ఒక టానిక్‌లాగా పనిచేస్తుంది. మరింత ఉత్సహాంతో పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రతిపక్షాల పార్టీలు చాలారకాల దుష్ప్రచారాలు చేశారు. చాలా నీలాపనిందలు వేశారు. వ్యక్తిగతమైన నిందలు సైతం చేశారు. వాటన్నింటిని పక్కనపెట్టి మా అభ్యర్థి సైదిరెడ్డిని 43 వేల మెజార్టీ పైచిలుకుతో గెలిపించారు. గతంలో అదే స్థానాన్ని మేము 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు 50 శాతం ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించారు. హుజూర్‌నగర్ ప్రజలు ఏఏ ఆశలు, నమ్మకాలు పెట్టుకుని టీఆర్‌ఎస్‌ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని సీఎం పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా ప్రజల సంక్షేమార్థం నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు నా సలహా. మొన్న శాసనసభలో కూడా చెప్పినా. ఎదుటివాళ్లను నిందించడమే ఒక రకమైన రాజకీయం అనుకుంటరు. ఆ పంథా కరెక్ట్ కాదు. మీ పంథా మార్చుకోమ్మని చెప్పా. ఈ రోజు ఒకరు అధికారంలో ఉండొచ్చు.. రేపు ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు. అది శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం ఏర్పడి పునర్నిర్మాణం జరుగుతున్న క్రమంలో మన రాష్ర్టాన్ని మనమే శపించుకోవడం, రాజకీయాల కోసం పచ్చి అబద్దాలు చెప్పడం, ప్రజలను గోల్‌మాల్ తిప్పడం, వ్యతిరేక థృక్పధాన్ని ప్రచారం చేయడం నూతనంగా ఏర్పడ్డ రాష్ర్టానికి మంచిది కాదు. దయచేసి పంథా మానుకోమ్మని చెప్పాం. గుడ్డెద్దు చేలోపడి మేసినట్లుగా.. ఏది పడితే అది అందుకుని పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తే మీకే బూమారాంగ్ అవుతదని చెప్పడం జరిగింది. ఇవాళ హుజూర్‌నగర్‌లో కుండబద్దలు కొట్టినట్లు ఆ మాట స్పష్టంగా రుజువైంది.

తాము రాష్ట్రం తెచ్చినవాళ్లం. దాని మంచిచెడ్డలు తెలుసు కాబ్బటే దాన్ని ట్రాక్‌లో పెట్టడం అనేవి తాము చాలా సీరియస్‌గా భావిస్తాం. ఉద్యమ సమయంలో చేసిన వాదన, తెలంగాణ అనుభవించిన కష్టాలు స్పష్టంగా తెలుసు కాబట్టి రాష్ట్రఅవతరణ అనంతరం కొన్ని తక్షణ రిలీఫ్ కావాలి కాబట్టి తామ తీవ్రంగా తీసుకుని వాటిపై పనిచేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా కొన్ని పనులు తీసుకున్నట్లు చెప్పారు. ఉదాహరణకు కరెంటు సమస్య.. రాష్ట్రంలో నేడు విద్యుత్ సమస్య లేదు. తాగునీటి రంగం.. సింగూరు ద్వారా ఐదారు నియోజకవర్గాలు తప్పిస్తే రాష్ట్రంలో నేడు ఎక్కడా తాగునీటి సమస్య లేదు. సాగునీటి రంగం.. కాళేశ్వరం దాదాపు పూర్తికావొస్తుంది. పాలమూరు ఫుల్ స్పీడ్‌తో సాగుతుంది. సీతారామ పూర్తి కావొచ్చింది. దేవాదుల 90 శాతం పూర్తియింది. ఈ నాలుగు ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణ సాగునీటి రంగం అద్భుతంగా ఉంటుంది. ఆ దిశగానే పయనిస్తున్నాం. ఇక సంక్షేమరంగం.. ఇది కూడా అనితర సాధ్యమైన రీతిలో రాష్ట్రంలో అమలు చేసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.

నవంబర్ నెలలోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తి అవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీవారు మెచ్చుకుంటున్నరు. మంచి సత్ఫలితాలు వచ్చినయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు నూతన చట్టాలు తెచ్చింది. గ్రామపంచాయతీ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాం. రెవెన్యూ చట్టం రావాల్సి ఉంది. గ్రామ పంచాయతీ చట్టం, మున్సిపల్ చట్టం ద్వారా నియంత్రిత విధానంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరగాలి. ఉత్త మాటలు చెప్పి అభివృద్ధి అంటే కుదరదు. అందుకు నిధులు సమకూర్చాలి. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్స్‌తో పాటు అంతే స్థాయిలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నం. గ్రామపంచాయతీలకు ప్రతీనెల రూ.339 కోట్లను విడుదల చేస్తున్నాం. మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు రూ. 1030 కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నవి. ఇంతే మొత్తంలో తాము కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. మొత్తం కలిపి రూ. 2060 కోట్లను రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల అభివృద్ధికి కేటాయించనున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది, మరో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వద్ద మరికొన్ని కేసులు ఉన్నవి. రేపు వాటిపై తీర్పు వస్తుంది. తీర్పు అనంతరం ఈసీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వస్తది. వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వెలువరిస్తం. నవంబర్ మాసంలోనే మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతి ప్రణాళిక కూడా ఒక నెల పాటు చేపడతామని సీఎం తెలిపారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సరిగా రాలేదన్నారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారికి కూడా స్థలాలు రాలేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వందకు వంద శాతం హైదరాబాద్‌లో ప్రతీ జర్నలిస్టుకు ఇళ్లు వచ్చే బాధ్యత తనదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం కేటాయించని నిధులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయిస్తున్న డబ్బు..జర్నలిస్టు కుటుంబాలకు అండగా నిలుస్తోంది. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇచ్చిన డబ్బు కన్నా..జర్నలిస్టులకు కేటాయించిన డబ్బు చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఈ నిధులు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఏడాదిలోపు జర్నలిస్టులందరికీ ఇండ్లు కేటాయించి ఇవ్వడమే కాకుండా..మంచి హౌసింగ్‌ స్కీం ప్రవేశపెట్టి ఇండ్లు కూడా కట్టుకునేట్లు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్‌లో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించాలనుకుంటున్నట్లు చెప్పారు.

- Advertisement -