క్రికెట్‌లో సచిన్-సెహ్వాగ్‌ల జోడీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు వీరు. ‘సచిన్ నాకు గురువుకంటే ఎక్కువ.. దేవుడితో సమానం’అని సెహ్వాగ్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. కాగా, కొద్ది గంటల కిందట ట్విట్టర్ లో వారిద్దరి మధ్య జరిగిన సంవాదంపై సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సచిన్, సెహ్వాగ్ లు గొడవపడ్డారని, ఒకరిపై మరొకరు అక్కసు వెళ్లగక్కుకున్నారని, ఆడటం మానేసినా జనాల్ని ఎంటర్ టైన్ చేయడం మానలేదని.. రకరకాల కామెంట్లు వెలువడుతున్నాయి. అసలేం జరిగిందంటే..
న్యూజిలాండ్‌తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించడం ద్వారా టీం ఇండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించడంతో సచిన్ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో సందేశం పెట్టాడు. ఈ ట్వీట్‌కు సెహ్వాగ్ స్పందిస్తూ.. అప్పుడప్పుడు కామెంటేటర్లను కూడా పొగడండి క్రికెట్ గాడ్, కొంచెం స్ఫూర్తి లభిస్తుంది అని సరదాగా అన్నాడు. సచిన్ కూడా సరదాగా ‘జియో మేరీ లాలా.. తథాస్తూ’ అంటూ రిట్వీట్ చేశాడు. ఆశీర్వాదంలో కూడా మీ ఐపిఎల్ జట్టు ఓనర్‌కి చెందిన బ్రాండ్‌ను మర్చిపోలేదా క్రికెట్ గాడ్ జి అంటూ సెహ్వాగ్ చమత్కరించాడు. అయితే సెహ్వాగ్ ట్వీట్‌కు సచిన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ నీ ఆలోచన వేరు, నా స్పెల్లింగ్ వేరంటూ సమాధానిమిచ్చాడు. జియో యజమాని ముకేశ్ అంబాని ఫ్రాంచైజీగా వ్యవహరిస్తోన్న ముంబై ఇండియన్స్ జట్టు తరుపున సచిన్ ఆడిన సంగతి తెలిసిందే. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో సెహ్వాగ్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు.