రాజధాని కీవ్ నగరం శుక్రవారం రష్యా బలగాల దాడులతో దద్దరిల్లింది. దీంతో ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కీవ్‌వైపు కదులుతున్నాయి. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతలతోనే కాదు, మాటలతోనూ ఉక్రెయిన్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. అధికారాన్ని అందిపుచ్చుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ ప్రభుత్వ పెద్దలను డ్రగ్స్ బానిసలు, ఉగ్రవాదులు, నియో నాజీలుగా అభివర్ణించారు. “నియో నాజీలకు మానవ కవచాలుగా మీ కుటుంబసభ్యులను ఉండనివ్వొద్దు. డ్రగ్స్ బానిసలు, నియో నాజీల ముఠాతో కంటే సైన్యంతో ఓ అభిప్రాయానికి రావడమే మాకు సులువు. అందుకే మరోసారి చెబుతున్నా… ఉక్రెయిన్ అధినాయకత్వాన్ని పీకిపారేయండి” అని పేర్కొన్నారు.
కాగా,రష్యన్ సేనలు కీవ్‌ను సమీపించాయి. అయితే ఉక్రెయిన్ సైన్యం ఫేస్‌బుక్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కీవ్‌లో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోంది. రష్యాకు రెండు భయానక బహుమతులను ఇచ్చామని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తెలిపింది.