ఓ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైనందుకు స్వీయ జరిమానా విధించుకున్నారు మంత్రి హరీష్ రావు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు హరీష్. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులకు చెత్తబుట్టలను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
మధ్యాహ్నం 11:30 గంటలకు ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకున్నారు. అప్పటిదాకా ఎంతో ఓర్పుగా వేచి చూస్తున్న మహిళలకు హరీశ్ క్షమాపణలు చెప్పారు. పరిహారంగా తనకు జరిమానా విధించాలని వారిని కోరారు. తమకు మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని కోరగా రూ.50లక్షలను మంజూరు చేశారు హరీష్.
దుబ్బాకను స్వచ్ఛ దుబ్బాకగా మార్చేందుకు మహిళా ప్రతినిధులు ముందుకారావాలని హరీష్ ఈ సందర్భంగా కోరారు. తడిపొడి చెత్తను వేసేందుకు రూ. 3 కోట్లతో డంపింగ్ యార్డు మంజూరు చేశామని…సిద్దిపేట తరహాలోనే దుబ్బాకను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.