డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా. సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్‌టైనర్ ‘రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ). టెంపర్ సినిమా తర్వాత సరైన హిట్ లేని పూరి ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఇజం కంటే ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆలస్యమైంది. అయితే, ఇజంతో అంతగా ఆకట్టుకోని పూరి … రోగ్ సినిమాపై ప్రత్యేక శ్రద్ద వహించి సినిమాను తెరకెక్కించాడు. సినిమా ఫస్ట్‌లుక్‌కి, మోషన్ పోస్టర్,ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. తెలుగు,కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాతో పూరి ఆకట్టుకున్నాడా…?కొత్తబ్బాయి ఇషాన్‌కి బ్రేక్ ఇచ్చిందా లేదా చూద్దాం..
కథ:
చంటి(ఇషాన్) ఎవరికీ భయపడని ఓ మంచి ప్రేమికుడు. కమిషనర్ కూతురు అంజలి(ఏంజెలా)ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ఆమెతోనే జీవితం అనుకుంటాడు. కానీ అంజలి మాత్రం ఇంట్లో పెద్దలు చూసిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్(సుబ్బరాజు)ను పెళ్లి చేసుకుంటుంది. అప్పటి నుంచి అమ్మాయిలంటేనే అసహ్యించుకుంటుంటాడు చంటి. అలాంటి కుర్రాడి జీవితంలోకి మరో అంజలి(మన్నారా) ఎలా వచ్చింది. ఆమెను చంటి ప్రేమించాడా? వీరిద్దరు ఎలా కలిశారు..? అన్న విషయాలు తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ పూరి మార్కు హీరోయిజం ,విలన్ క్యారెక్టర్, నేపథ్య సంగీతం. రోగ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా పూరి మార్క్ హీరోయిజంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయిన ఇషాన్ మాస్ హీరోగా మెప్పించే ప్రయత్నం చేశాడు. యాక్షన్‌తో పాటు ప్రేమ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. హీరోయిన్ ఏంజెలా గ్లామర్ షోకే పరిమితం కాగా మన్నారా చోప్రా తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. విలన్‌గా అనూప్ ఆకట్టుకున్నాడు. ఇతరపాత్రల్లో అలీ,పోసాని,సుబ్బరాజు పర్వాలేదనిపించారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింత రక్తి కట్టిస్తాయి. సైకో పాత్ర ప్రవేశంతో తర్వాత ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ మొదలవుతుంది.
మైనస్ పాయింట్స్ :
రోటిన్ టేకింగ్, కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, సెకండాఫ్. పూరి సినిమాలంటేనే హీరోయిజం,డైలాగ్‌లు గుర్తుకొస్తాయి. అయితే ఈ సినిమాలో మాత్రం అలాంటి సంభాషణలు సాదాసీదాగానే అనిపిస్తాయి. కమిషనర్ కూతురిని ప్రేమించడం.. ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరగడం.. అది తట్టుకోలేని చంటి అక్కడికి వెళ్లి గొడవ చేయటం.. ఆ తర్వాత జైలు జీవితం.. ఇలా సాగిపోతాయి సన్నివేశాలు. ఇంటర్వెల్ తర్వాత పెద్దగా మలుపులు లేకపోవడం ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి వూహకు అందుతూ సాగడంతో సాదాసీదాగా అనిపిస్తాయి. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా మామూలుగానే అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. సునీల్ కశ్యప్ అందించిన పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా వచ్చింది. హీరో,విలన్ క్యారెక్టర్‌లకు డిజైన్ చేసిన థీమ్స్ వాళ్ల క్యారెక్టర్స్‌ను మరింతగా ఎలివేట్ చేశాయి. ముఖేష్ సినిమాటోగ్రఫి,జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ సినిమా స్ధాయికి తగ్గట్టుగా ఉంది. తన్వి ఫిలింగ్ నిర్మాణ విలువుల బాగున్నాయి. కొంతకాలంగా రొటీన్ ఫార్ములాతో బోర్ కొట్టిస్తున్న పూరి జగన్నాథ్, మరోసారి రోగ్ విషయంలోనూ అదే స్టైల్‌ను ఫాలో అయ్యాడు. అక్కడక్కడా పూరి కలం కాస్త మెరిసినా ఓవరాల్‌గా టేకింగ్ మాత్రం రోటిన్‌గా అనిపించింది.
తీర్పు:
చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరి జగన్నాథ్ …రోగ్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. పూరి నుంచి సినిమాలు వస్తున్నాయంటేనే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.పూరి మార్కు హీరోయిజం ,విలన్ క్యారెక్టర్, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ కాగా రోటిన్ టేకింగ్, కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం మైనస్ పాయింట్. మొత్తంగా రోగ్ పూరి మార్క్ రోటిన్ సినిమా.
విడుదల తేదీ: 31/03/2017
రేటింగ్:2.5 /5
నటీనటులు: ఇషాన్, మన్నారా చోప్రా
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాతలు: సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి
దర్శకత్వం: పూరి జగన్నాథ్