ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ మరోసారి అదరగొట్టింది. ఆల్‌రౌండ్ షోతో విండీస్‌ను మట్టికరిపించింది. కరేబియన్లు విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 33.1 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసి8 వికెట్ల తేడాతో విజయబావుట ఎగురవేసింది. జో రూట్ (94 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆదరగొట్టగా.. బెయిర్‌స్టో (45; 7 ఫోర్లు), వోక్స్ (40; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. టోర్నీలో రెండో సెంచరీ చేసిన రూట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ప్రపంచకప్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు రూట్. విజయానికి 14 పరుగుల దూరంలో వోక్స్ వెనుదిరిగినా.. స్టోక్స్ (10 నాటౌట్)తో కలిసి రూట్ లాంఛనాన్ని ముగించాడు. వెస్టిండీస్‌ను చిత్తుచేసి పాయిం ట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లో 212 పరుగులకు ఆలౌటైంది. నికోలస్ పూరన్ (63; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా.. హెట్‌మైర్ (39), గేల్ (36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బార్బడోస్ ఆటగాడు ఆర్చర్ కరీబియన్లను ఆటాడుకున్నాడు. బుల్లెట్‌లాంటి బంతులతో తన మాజీ సహచరులను బెంబేలెత్తించాడు. మార్క్ వుడ్ (3/18), జొఫ్రా ఆర్చర్ (3/30) ధాటికి విండీస్ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది.