రివ్యూ : వైరస్

330
Review Virus
- Advertisement -

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “వైరస్”. “నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్” అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పుల్లరేవు రామచంద్రారెడ్డి సమర్పిస్తున్నారు. మీనాక్షి భుజంగ్-సునీల్ కశ్యప్ లు సంయుక్తంగా సంగీతం అందించిన ఈఈ చిత్రం పాటలతోపాటు ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. ఇక టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంపూ …. వైరస్‌తో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?ప్రేక్షకులను అలరించాడా లేదా చూద్దాం…

కథ :

కిట్టు(సంపూర్ణేష్ బాబు) ఓ ప్రొఫెషనల్ హ్యాకర్.  యూనివర్సిటీ టాపర్ గా నిలిచినా ఆర్ధిక స్తోమత సరిగా లేకపోవడం మాస్టర్ డిగ్రీ చేయలేక ఓ కాఫీ షాప్ లో పని చేస్తాడు. కిట్టు టాలెంట్‌ని గుర్తించిన అనన్య(నిదిషా)  సాయం చేయడంతో అతను అమెరికా వెళ్లి మాస్టర్ డిగ్రీ చేసి అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అనన్య ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో ఇండియాకి తిరిగొచ్చిన సంపూ  ఆ అపార్ట్ మెంట్ లో ఓ నెట్ వర్క్ ఆపరేటర్ గా ఉండి ఆమె డెత్ మిస్టరీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సంపూకి  www.వైరస్.com తగులుతుంది..? అసలు సంపూకి  www.వైరస్.comకు సంబంధం ఏమిటి? అనన్య మర్డర్ మిస్టరీని ఎలా చేదించాడు అన్నదే కథ.

Review Virus
ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ అంటే అది సంపూర్ణేష్ బాబు. అతను తనదైన మేనరిజం, యాక్టింగ్ తో కథ మొత్తం నడిపించాడు. అలాగే సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కథ కూడా ప్రస్తుతానికి తగ్గట్టే ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో సోషల్ మీడియా వలన ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు.

సినిమాకు శుభం కార్డు పడే ముందు…. సంపూ తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. సంపూ  చెప్పిన డైలాగులు ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి. హీరోయిన్ గా చేసిన గీతషా తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కమెడియన్స్ గా చమ్మక్ చంద్ర, వైవ హర్షలు వారి పాత్ర పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఏ సినిమాకైనా కథే ప్రధాన బలం…. కథ కాస్త అటు ఇటుగా ఉన్నా మంచి స్క్రీన్ ప్లే ఉంటే ప్రేక్షకుడిని సంతృప్తి పరచవచ్చు. ఈ సినిమా విషయంలో కథ చాలా రొటీన్, ఇక స్క్రీన్ ప్లే కూడా అంత ఆసక్తికరంగా లేదు. పేరుకే కామెడీ సినిమా గానీ ఎక్కడ కామెడీ పేలలేదు. అయితే సినిమాలో అసలు విలన్ ఎవరో చెప్పకుండా చివరి వరకు కాస్త సస్పెన్స్ మెయింటేన్ చేసి సినిమా క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చాడు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ ట్రాక్ లో అటు రొమాన్స్ కాని, ఇటు లవ్ గాని ప్రేక్షకులకి కనిపించదు. సంబంధం లేకుండా సాగిపోయే సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకుడుకి అసహనం కలిగిస్తాయి.ర న్ టైం కూడా సినిమాకి మరో మైనస్.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కృష్ణ సినిమా ద్వారా ప్రస్తుతం సోషల్ మీడియా వలన జరిగే అనర్దానలని చెప్పాలనుకున్న ప్రయత్నం కాస్తా మెచ్చుకోవాల్సిన విషయం. అయితే దాని కోసం ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులని పూర్తిగా నిరాశ పరిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా సునీల్ కశ్యప్ సినిమాకి కాస్తా మైనస్ అని చెప్పుకోవాలి.  సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్…. చాలా యావరేజ్‌గా ఉంది. ఇక సినిమాలో టెక్నికల్ అంశాలపరంగా సినిమాటోగ్రఫీ ది బెస్ట్ గా ఉంటే సినిమాలోని చాలా మైనస్ లు కవర్ చేయవచ్చు. కానీ ఇక్కడ వి.జె సినిమాటోగ్రఫీకి అంత శక్తి లేదని తేలిపోయింది. ఇతర విభాగాలు ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ పనితీరు కూడా అంతగొప్పగా ఏమీ లేదు. మాటలు అందించిన దుర్గాప్రసాద్ రాయుడు ఎక్కువగా ప్రాసలకే ప్రాధాన్యం ఇచ్చాడు…. డైలాగ్స్ అక్కడక్కడా కాస్త ఫర్వాలేదనే చెప్పొచ్చు. నిర్మాతలు సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల నిర్మాణ విలువలు బాగున్నాయి.

Review Virus

తీర్పు :

తనదైన మార్క్‌ కామెడీతో అలరించే సంపూ మరోసారి అదే నమ్ముకుని చేసిన ప్రయత్నమే వైరస్. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా రొటీన్‌ కథనంతో బోర్ కొట్టించాడు. సంపూ అందించే వెరైటీ తరహా ఎంటర్టైన్మెంట్ ను చూడటానికి ఇష్టపడే వారు  చూడదగ్గ సినిమా వైరస్ .

విడుదల తేదీ:30/06/2017
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సంపూర్ణేష్ బాబు, వెన్నెల కిషోర్, గీతా షా, నిదిషా
సంగీతం : మీనాక్షి, సునీల్ కశ్యప్
నిర్మాతలు : సలీం ఎండి, శ్రీనివాస్ మంగళ
దర్శకత్వం : ఎస్.ఆర్. కృష్ణ

- Advertisement -