రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ కేటాయింపు నిలిపివేత..

227
Remdesivir
- Advertisement -

రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ ఔషధాల కేటాయింపులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. గత కొద్దిరోజుల వరకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరలు సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఈ కీలక ఇంజెక్షన్‌కు ఏర్పడిన అధిక డిమాండే అందుకు కారణం. అయితే, ఇప్పుడా పరిస్థితి లేదని కేంద్రం చెబుతోంది. దేశంలో డిమాండ్ ను మించిపోయేలా రెమ్ డెసివిర్ ఉత్పత్తి జరుగుతోంది. దీనిపై కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సూఖ్ మాండవ్య వివరణ ఇచ్చారు.

గతంలో కంటే రెమ్‌డెసివిర్ ఉత్పత్తి పది రెట్లు పెరిగిందని మాండవీయ ఈమేరకు వెల్లడించారు. దేశానికి తగినంత రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. ఇక నుంచి దేశంలో రెమ్‌డెసివిర్ ఔషధాల లభ్యతను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైస్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షించనున్నదని కేంద్రం తెలిపింది. కాగా, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల ఉత్పత్తి అంచనాలకు మించి జరుగుతుండడంతో కేంద్రం తన వద్ద 50 లక్షల వయల్స్ ను నిల్వ ఉంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిల్వలను అత్యవసర సమయాల్లో వినియోగించనున్నారు. ప్రస్తుతం డిమాండ్ కంటే లభ్యత ఎక్కువగా ఉన్నందున రాష్ట్రాలకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయింపులను కేంద్రం నిలిపివేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -