ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆర్సీబీ అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదుచేసి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కొల్పోకుండా చేధించింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా… కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. మరో బౌలర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు.