నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం పార్ట్-1’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. సుమారు రూ.4 వేల కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 5, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి పండుగకు ముందే ఈ చిత్రం విడుదల కానుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 జూలైలో విడుదలైన ప్రకటన టీజర్లో రెండో భాగాన్ని కూడా 2027 దీపావళి సమయంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
ప్రస్తుతం రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ తదితరులు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో నటీనటులను తమ జీవితాల్లో వెలుగులు నింపే ‘దీపం’ గురించి ప్రశ్నించారు. దీనికి రణబీర్ కపూర్ ఆసక్తికరంగా స్పందించారు. తన జీవితంలో వెలుగులు నింపిన దీపం తన కుమార్తె రాహా కపూర్ అని చెప్పారు. ఈ ఏడాది ఆమెకు నాలుగో దీపావళి అని తెలిపారు.
అంతేకాకుండా నవంబర్ 6న రాహా పుట్టినరోజు కూడా ఉందని రణబీర్ వెల్లడించారు. నవంబర్ 8న దీపావళి జరగనుండగా రెండు రోజుల ముందే తన కుమార్తె పుట్టినరోజు రావడం ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చిందన్నారు. రాహాకు ఎంతోమంది ఆశీస్సులు, మంచి భావనలు, సానుకూల వాతావరణం లభించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Also Read:క్రికెట్కు మ్యాక్స్వెల్ రిటైర్మెంట్..
నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. రవీ దూబేతో పాటు అరుణ్ గోవిల్ (దశరథుడు), లారా దత్తా (కైకేయి), ఇందిరా కృష్ణన్ (కౌసల్య), సోనల్ ఝా (సుమిత్ర), ఆదినాథ్ కోఠారే (భరతుడు), కాజల్ అగర్వాల్ (మండోదరి), రకుల్ ప్రీత్ సింగ్ (శూర్పణఖ) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

