బాణసంచా కాల్చే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాలీవుడ్ నటి దియా మీర్జా రూపొందించిన వీడియోపై నెలకొన్న వివాదంలో బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియోను వ్యతిరేకిస్తూ కొందరు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తొలగించిన ఆ వీడియోను తిరిగి సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ను ఆదేశించింది.
ముంబైలో బహిరంగ రహదారులపై బాణసంచా కాల్చవద్దని ప్రజలకు సూచిస్తూ బీఎంసీ ఓ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నటి దియా మీర్జాతో ప్రత్యేక వీడియో రూపొందించింది. ప్రజలు రోడ్లపై టపాసులు కాల్చకుండా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చే అంశంపై బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.
అయితే దియా మీర్జా వీడియోపై కొందరు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయంగా విమర్శలు రావడంతో బీఎంసీ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ వీడియోను తొలగించింది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి వెళ్లింది.
Also Read:క్రికెట్కు మ్యాక్స్వెల్ రిటైర్మెంట్..
ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ డాక్టర్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం.. వీడియోపై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేసింది. ఇలాంటి అవగాహన కార్యక్రమాలపై రాజకీయ నేతలు స్పందించిన తీరు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.

