బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీలను ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే. విచారణను ఎదుర్కొన్నవారిలో రియా చక్రవర్తి, దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనని సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచారని.. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక డ్రగ్స్ కేసులో తన గురించి తప్పుడు ప్రసారం అవుతున్న వార్తలను ఆపాలని కోరుతూ రకుల్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది.
మీడియా రాస్తున్న వార్తలతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని పిటిషన్ లో తెలిపింది. ఎన్సీబీ తన విచారణను పూర్తి చేసి, నివేదిక అందించేంత వరకు తన పేరును ప్రస్తావించకుండా మీడియాను నియంత్రించాలని కోరింది. అయితే, దీనిపై ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు… కేంద్ర ప్రభుత్వంతో పాటు మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది.
శుక్రవారం ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరైన రకుల్ ను సుమారు 4 గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తితో పరిచయం గురించి.. రియాతో రకుల్ జరిపిన వాట్సాప్ చాటింగ్ గురించి ఎన్సీబీ ఆమెను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా రియాతో చాట్ చేసినట్లు అంగీకరించిన రకుల్.. తనకు డ్రగ్స్ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని.. తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీకి తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో తనని సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచారని రకుల్ చెప్పినట్లు తెలుస్తోంది.