అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్‌తో సమావేశమయ్యారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ . 13వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ (ADMM-Plus) సదస్సు సందర్భంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్య పురోగతిపై సమీక్షించారు.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని తెలిపారు. ఇరు దేశాల మధ్య పదేళ్ల రక్షణ సహకార చట్రం అమలులో సాధించిన పురోగతిని సమీక్షించినట్లు పేర్కొన్నారు.
సైనిక సాంకేతిక పరిజ్ఞానం, సమాచార మార్పిడి, సంయుక్త ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో భారత్-అమెరికా వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించినట్లు వెల్లడించారు.
భారత్-అమెరికా మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం స్వేచ్ఛాయుత, బహిరంగ, సురక్షిత ఇండో-పసిఫిక్ ప్రాంతానికి కీలక పునాదిగా కొనసాగుతోందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత విస్తరించడం ద్వారా ప్రాంతీయ భద్రత, వ్యూహాత్మక సమన్వయం బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు.
Also Read:షారుఖ్ ‘కింగ్’ కాపీనా?
సైనిక సామర్థ్యాల అభివృద్ధి, ఆధునిక రక్షణ సాంకేతికత, సమాచార భాగస్వామ్యం వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సమావేశంలో ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్-అమెరికా రక్షణ సంబంధాలు అంతర్జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

