Cyclone Arnab:ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు

4
- Advertisement -

అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు గరిష్ఠంగా 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. దాదాపు 4,000 తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, ప్రమాదకర ప్రాంతాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. విపత్తు నిర్వహణ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు పలు రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 జిల్లాల్లో 2,131 తుపాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించేందుకు 1,087 వైద్య బృందాలను సిద్ధంగా ఉంచింది. అదేవిధంగా 8,281 అత్యవసర పడకలు, 1,274 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ఇవాళ ఉదయం 5.30 గంటల సమయానికి అర్నాబ్ తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో దాదాపు స్థిరంగా ఉందని ఐఎండీ తెలిపింది. తుపాను కేంద్రం 16.4 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.0 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉన్నట్లు వెల్లడించింది.

Also Read:షారుఖ్ ‘కింగ్‌’ కాపీనా?

నర్సాపూర్‌కు తూర్పున 30 కిలోమీటర్లు, యానాంకు దక్షిణ-నైరుతి దిశలో 45 కిలోమీటర్లు, కాకినాడకు 70 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు-ఈశాన్య దిశలో 90 కిలోమీటర్లు, బాపట్లకు 170 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది.

బాపట్ల, విశాఖపట్నం మధ్య యానాంకు దక్షిణంగా తుపాను తీరం దాటే అవకాశం ఉందని తొలుత అంచనా వేసింది. గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని, గాలుల వేగం అప్పుడప్పుడు 140 కిలోమీటర్లకు చేరవచ్చని తెలిపింది.తుపాను తొలుత వాయవ్య దిశగా, అనంతరం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లి ఒడిశా ప్రాంతాన్ని ప్రభావితం చేయవచ్చని తెలిపారు. ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, నవరంగ్‌పూర్, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -