యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, తమన్నా,రాణా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన తారాగణంగా, సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లు నిర్మాతలుగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘బాహుబలి2’. – ‘ది కన్‌క్లూజన్’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి, ప్రభాస్, రాణా, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని పాల్గొన్నారు.
నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మాట్లాడుతూ – ”షూటింగ్ ప్రకారం చూస్తే సినిమాలో ముఖ్య ఎపిసోడ్స్ అన్నీ పూర్తయ్యాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేసేస్తాం. కొన్ని సీన్స్, సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 28న బాహుబలి2 విడుదల చేయబోతున్నాం. వచ్చే ఏడాది, అంటే జనవరిలో సినిమా ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలున్నాయి” అన్నారు.
నా పుట్టినరోజున ఫస్ట్ లుక్
ప్రభాస్ మాట్లాడుతూ – ”బాహుబలి కామిక్ బుక్స్ విడుదల చేస్తున్నాం. అక్టోబర్ 1న ఆనిమేటెడ్ సిరీస్ టీజర్ విడుదల చేస్తాం. నా ఫ్యాన్స్, అందరూ ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 22న నా పుట్టినరోజుకు ఒక రోజు ముందు విడుదల చేస్తున్నాం. మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు సినిమా చేద్దాం అనుకున్నా. కానీ బాహుబలి లాంటి ఒక మహా సముద్రం మధ్యలో చిన్న చిన్న నదులను వదలటం కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే రెస్ట్ తీసుకున్నా. తరువాత సుజిత్ తో, రాధాకృష్ణ తో సినిమాలు ఓకే అయ్యాయి ” అన్నారు.
బాహుబలి ఒక మహా వృక్షం
రాణా మాట్లాడుతూ – ”యూరి లో జరిగిన సైనిక శిబిరం పై దాడి ని ఖండిస్తూ, మన దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పిస్తున్న వీర జవాన్లకు వందనం. ఇప్పుడు నేనొక సినిమాల అభిమానిగా మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్‌లో చాలా ఇంగ్లిష్ సినిమాలు చూసేవాడిని. ఇండియానా జోన్స్ లాంటి వార్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమాలకు సంబంధించిన బుక్స్ ఎక్కువగా చదివేవాడిని. ఇండియన్ సినిమా ఎప్పటికైనా ఇలా ఉంటుందా? అని అనుకునేవాడిని. బాహుబలి సినిమా ప్రారంభంలో నేను రాజమౌళిగారిని కలిసినప్పుడు ఒక మ్యాప్ చూపించారు. మహిష్మతి అనే రాజ్యం, ఆ రాజు, అందులోని ప్రజలు, వారు వాడే వస్తువులు వంటివన్నీ నాకు సవివరంగా చెప్పారు. మహిష్మతి రాజ్యం అనేది రాజమౌళిగారు క్రియేట్ చేసిన ప్రపంచం, మహా వృక్షం. ఆ మహా వృక్షంలో చాలా కొమ్మలున్నాయి. అందులో ఒక కొమ్మ బాహుబలి సినిమా. ఇది కాకుండా టెలివిజన్ సీరీస్, కామిక్ బుక్స్, మెర్చండైజింగ్, వర్చువల్ రియాలిటీ వంటి ఎన్నో అంశాలు రాబోతున్నాయి. ఫైనెస్ట్ వార్ ఫిల్మ్ ఇన్ ద కంట్రీని తెరకెక్కించడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. చాలా సినిమాలకి ప్రమోషన్ తాలూక టీ షర్ట్ లు వంటివి చూస్తుంటాం. యామజాన్ ప్రైమ్ నుంచి మా టీజర్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నాం. వరల్డ్ క్లాస్ యానిమేషన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది” అన్నారు.
వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియెన్స్ తో `బాహుబలి2`
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ – ”బాహుబలి టీమ్ కి అక్టోబర్ చాలా ఎగ్జైటింగ్ నెల. ఎందుకంటే బాహుబలికి సంబంధించిన రకరకాల విషయాలు అక్టోబర్‌లోనే విడుదలవుతాయి. బాహుబలి యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో రానుంది. దానికి సంబంధించిన టీజర్ అక్టోబర్ 1న విడుదలవుతుంది. అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తున్నాం. అదేంటనేది ఇప్పుడే చెప్పం. ఆ న్యూస్ తన అభిమానులకే కాదు మొత్తం సౌత్ ఇండియాకే గర్వకారణంగా ఉంటుంది. అలాంటి న్యూస్ అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఇక బాహుబలిని ఒక మహావృక్షం గా తీసుకుంటే టీవీ సీరీస్, కామిక్స్, బుక్స్, గేమ్స్ అన్నీ హయ్యస్ట్ బడ్జెట్‌తో తీస్తున్నాం. బాహుబలితో వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియెన్స్ అనే దాన్ని పరిచయం చేస్తున్నాం. ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్‌తో అందరూ ఎగ్జయిట్ అవుతారు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని 360 డిగ్రీస్‌లో ఎక్స్ పీరియన్స్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఇది. ఈ రోజు మధ్యాహ్నం నేను తొలి టెస్ట్ చూశా. యూఎస్‌కి వెళ్లి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని గురించి తెలుసుకున్నా. రకరకాల కంపెనీల్లో వీడియోలు చూశా. నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా, మేం తీసిన టెస్ట్ షార్ట్ చాలా మంచి క్వాలిటీతో ఉంది.
2D తెరమీద బొమ్మ చూస్తున్నట్టు కాకుండా మాహిష్మతి ప్రపంచంలోకి వెళ్లి , అక్కడ జరగుతున్న కథని అక్కడివారితో కలిసి చూస్తున్న అనుభూతిని కలుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే గూగుల్ కార్డ్ బోర్డ్ లో ఫోన్ పెట్టుకుని 360 డిగ్రీస్ లో చూస్తే వర్చ్యువల్ రియాలిటీ కనిపిస్తుంది. మరి కొంచెం మెరుగైన క్వాలిటీ కావాలంటే శామ్‌సంగ్ గేర్ వియర్‌ని పెట్టుకుని వర్చువల్ ప్రపంచాన్ని చూడొచ్చు. ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్ కి పనికొచ్చే VR గ్లాస్సెస్ ని వాడి చూడొచ్చు.వీటి ధర రూ.100 నుంచి రూ.3000 ఉండొచ్చు.
అత్యుత్తమ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం రూ.2లక్షల ఖర్చుతో ఆక్యులస్ రిఫ్ట్ గానీ, వైవ్‌గానీ దొరుకుతాయి. మేం చేసే బాహుబలి VR ఎక్స్ పీరియన్స్ ఆ గ్లాసెస్ కోసం చేస్తున్నాం. ఇవి అందరికీ అందుబాటు లో లేవు కాబట్టి 200, 300 థియేటర్లలో వాటిని స్టాల్స్ పెట్టి మేమే ఇస్తాం. దానితో ఆడియెన్స్ ఈ ఎక్స్ పీరియన్స్ ని పొందొచ్చు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటిది తొలిసారి బాహుబలి సినిమాలకే జరుగుతుంది. దీని కోసం మేం రూ.25 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నాం. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్‌ను విడుదల చేస్తాం. దాంతో పాటు మేకింగ్ వీడియోస్‌ని వర్చువల్ రియాలిటీలో చేస్తున్నాం. డైరక్ట్‌గా కావాలంటే ఫోన్‌లో ప్యాన్ చేసుకుని, గూగుల్ కార్డ్ బోర్డ్‌లోనూ చూడొచ్చు. మేకింగ్ వీడియోలను కూడా హై క్వాలిటీ VR లో చేస్తున్నాం. వర్చువల్ రియాలిటీలో రూపొందించిన తొలి మేకింగ్ వీడియో ప్రభాస్ పుట్టినరోజుకి విడుదల చేయనున్నాం” అన్నారు.