కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) సవరణ బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న “చారిత్రక అన్యాయం”గా అభివర్ణించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాల నిరసనలకు పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లు తమిళనాడు మరియు ఇతర దక్షిణాది రాష్ట్రాల పట్ల భారీ చారిత్రక అన్యాయమని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మండిపడ్డారు. ఈ బిల్లును నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్లజెండాలు ఎగురవేసి తమ నిరసనను తెలపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన స్టాలిన్, “భారతదేశ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నందుకు తమిళనాడు మరియు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తున్నారా?” అని ప్రశ్నించారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం భారీగా తగ్గిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“వింధ్య పర్వతాలకు అటువైపున ఉన్న ప్రతి దక్షిణాది భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. బీజేపీ నిప్పుతో చెలగాటం ఆడుతోంది” అని స్టాలిన్ హెచ్చరించారు. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే మిన్నగా ఒక స్వయం గౌరవం గల తమిళుడిగా నేను మరోసారి హెచ్చరిస్తున్నాను.. నల్లజెండాలు ఎగురనివ్వండి” అంటూ ఆయన పిలుపునిచ్చారు.ఏప్రిల్ 16 నుండి 18 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది.ఇందులో 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే అవకాశం ఉంది.2029 సాధారణ ఎన్నికల నుండి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో భాగంగా ఈ విస్తరణ అవసరమని కేంద్రం వాదిస్తోంది.
ALso Read:తమిళనాడు సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

