డ్రగ్స్ దందాలో నోటీసులు అందుకుని, విచారణకు హాజరైన 12 మంది టాలీవుడ్ ప్రముఖుల దగ్గర నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. వీరి విచారణ పూర్తయింది. ఓ న్యూస్ ఛానెల్ తో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ, పక్కా ఆధారాలు సేకరించామని, విచారణ వేగంగా కొనసాగుతోందని, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చార్జిషీట్ వేస్తామని చెప్పారు. డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బాధితులా? లేక నిందితులా? అనే విషయం చార్జిషీట్ లోనే తేలుస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ కేసులో ఎక్కడా స్కూళ్లు, కాలేజీల పేర్లు వెల్లడించలేదని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు త్వరలోనే వస్తుందని చెప్పారు.
ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేసి 22 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రగ్స్ కేసు విచారణ వేగంగా కొనసాగుతుందని చెప్పారు. దీనిపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణ నిమిత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకెవరినైనా పిలుస్తారా? అనే ప్రశ్నకు.. ‘నో కామెంట్స్’ అని అకున్ సమాధానమిచ్చారు.