సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు రావాలన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో మయూఖా టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్‌ను ప్రారంభించిన పూరి..ఈ సంస్థ మంచి ఆర్టిస్టులను ఇండస్ట్రీకి అందించగలదన్న నమ్మకం నాకుందన్నారు. ఉత్తేజ్ గత 32 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడు. నన్ను రాంగోపాల్ వర్మ గారికి పరిచయం చేసి నేను దర్శకుడు కావటానికి కారకుడైన ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నటుడిగా, రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాక్టింగ్ కోచ్ గా ఉత్తేజ్ కు ఉన్న అనుభవం అపారం. మా అబ్బాయి ఆకాష్ కు కూడా ఉత్తేజ్ దగ్గరే ట్రైనింగ్ ఇప్పించాను. ఉత్తేజ్ ప్రారంభించిన ఈ యాక్టింగ్ స్కూల్ కు నా అండదండలు పూర్తిగా ఉంటాయని హామీ ఇస్తున్నానని తెలిపారు.
ఉత్తేజ్ మాట్లాడుతూ” అత్యుత్తమ ప్రమాణాలతో ఒక ఫిలిం ఇనిస్టిట్యూట్ ప్రారంభించాలనే కోరిక ఎప్పటినుంచో ఉన్నప్పటికీ సమర్థవంతమైన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ దొరికినప్పుడు మాత్రమే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్స్ సక్సెస్ అవుతాయి… అలాంటి ఫ్యాకల్టీ దొరికింది కాబట్టే ఈరోజు “మయూఖ ఫిలిం యాక్టింగ్ స్కూల్ ” ను ప్రారంభిస్తున్నాను. “ఇలాంటి యాక్టింగ్ స్కూల్ ఒకటి ప్రారంభించు.. మా అండదండలు ఎప్పుడూ ఉంటాయి అని పూరి జగన్నాథ్ , కృష్ణవంశీ, సురేందర్ రెడ్డి, జె.డి.చక్రవర్తి, నందిని రెడ్డి వంటి ప్రముఖ దర్శకులు నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారి ప్రోత్సాహ బలంతోనే ఈ రోజున ఈ యాక్టింగ్ స్కూల్ ప్రారంభిస్తున్నాను.
నా ప్రయత్నాన్ని అభినందిస్తూ వీరందరూ ఇచ్చిన మెసేజ్ లు చూసి ఇంకా ఎంతోమంది సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అల్లు శిరీష్ స్వయంగా ఫోన్ చేసి నేను ఇనిస్టిట్యూట్లో చేరతాను అని ముందుకు రావటం, అల్లు అర్జున్ గారు వీలు చూసుకుని తప్పకుండా ఒకరోజు స్కూల్ కు వస్తాను… మీ స్టూడెంట్స్ తో, ఫ్యాకల్టీతో కొంత టైం స్పెండ్ చేస్తాను”- అని చెప్పటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నుండి ప్రారంభమయ్యే తొలి బ్యాచ్ క్లాసెస్ రెండు నెలల పాటు జరుగుతాయి. వ్యక్తిగతంగా ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ అటెన్షన్ ఫోకస్ చేయటం కోసం 32 అప్లికేషన్స్ వచ్చినప్పటికీ బ్యాచ్ కి కేవలం 18 మంది స్టూడెంట్స్ ను మాత్రమే తీసుకున్నాము. దీంతో ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ పూర్తయ్యాయి. పూరి జగన్నాథ్ గారు, జెడి చక్రవర్తి గారు, లక్ష్మీ భూపాల్ గారు, నడిమింటి నరసింహారావు, జర్నలిస్ట్ ప్రభు గారు తదితర ప్రముఖులు అందరు విచ్చేసి మా మయూఖ యాక్టింగ్ స్కూల్ కు తమ అంద దండలు ఉంటాయని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు” అన్నారు.
ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ “నా చిరకాల మిత్రుడైన ఉత్తేజ్ లో మంచి నటుడే కాదు.. మంచి దర్శకుడు, రచయిత కూడా ఉన్నారు. మంచి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో తను ఇచ్చే శిక్షణ ఫాలో అయితే మీరంతా నటనలో తప్పకుండా గొప్పగా రాణిస్తారు. మంచి స్టాండర్డ్స్ తో, క్రమశిక్షణతో ప్రారంభమైన ఈ “మయూఖ టాకీస్ యాక్టింగ్ స్కూల్” అతి త్వరలోనే ఒక అగ్రశ్రేణి ఫిలిం ఇనిస్టిట్యూట్ గా ఎదుగుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
మ్యాంగో మ్యూజిక్ అండ్ మ్యాంగో న్యూస్ అధినేత “వీరపనేని రామకృష్ణ” మాట్లాడుతూ – ” ఉత్తేజ్ ఒక మంచి నటుడిగా, మంచి మిత్రుడిగా నాకు చాలా కాలం నుండి పరిచయం. తను ప్రారంభించిన “మయూఖా టాకీస్ యాక్టింగ్ స్కూల్” కు అన్ని విధాల నా అండదండలు ఉంటాయి అన్నారు.