పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు బీజేపీలో చేరారు. ఆప్‌కు రాజీనామా చేసిన రెబల్ ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా, చేతన్ సింగ్ జౌరామజ్రాతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి, ఆప్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అక్కడ నేతలు ‘బీజేపీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పటియాలా జిల్లాలోని సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా ఆదివారం ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం, భగవంత్ మాన్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయని, ఢిల్లీ నాయకత్వం పంజాబ్ పాలనలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.
మరోవైపు అమృత్సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ కూడా సోమవారం పంజాబ్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలోనే ఆయనను ఆప్ ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అయితే ఆయన బీజేపీలో చేరడం కూడా ఈ రాజకీయ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.
ఆప్ ఇటీవల 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. అయితే సనౌర్, సమానా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు స్థానాల్లో ప్రత్యామ్నాయ నేతలకు బాధ్యతలు అప్పగించడంతో తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కకపోవచ్చని పఠాన్మజ్రా, జౌరామజ్రా భావించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read:కాంగ్రెస్ ర్యాలీ.. బీఎస్-6 వాహనాల తనిఖీలు
2022 అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 92 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన ఆప్‌కు 2027 ఎన్నికలకు ముందు ముగ్గురు ఎమ్మెల్యేల నిష్క్రమణ గట్టి రాజకీయ సవాలుగా మారింది.

