దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభ వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిందని వ్యాపార సంఘాలు ఆరోపించాయి. రాంలీలా మైదాన్‌లో ఆదివారం జరిగిన ఈ సభ కారణంగా నగరంలోని 20 నుంచి 25 ప్రధాన మార్కెట్లలో సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయని వెల్లడించాయి. దీంతో రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్ల వరకు వ్యాపార నష్టం వాటిల్లిందని వ్యాపారులు అంచనా వేశారు. దీపావళి పండుగకు ముందు అత్యంత కీలకమైన వ్యాపార సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) చైర్మన్ బ్రిజేశ్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. సభ జరిగే ప్రాంతం చుట్టుపక్కల ఉన్న మార్కెట్లలో మొత్తం మూడు లక్షల దుకాణాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 80 శాతం అంటే 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయి. ట్రాఫిక్ ఆంక్షలు, రద్దీ, భారీగా ప్రజలు తరలివస్తారనే అంచనాలతో వ్యాపారులు దుకాణాలు తెరవలేదని తెలిపారు.
ఢిల్లీ చుట్టుపక్కల పట్టణాల నుంచి వ్యాపార అవసరాల కోసం సాధారణంగా వచ్చే మూడు నుంచి నాలుగు లక్షల మంది ఈసారి నగరానికి రాలేదని గోయల్ పేర్కొన్నారు. అదేవిధంగా సుమారు 5 వేల టెంపోలు, ట్రక్కులు మార్కెట్లకు సరుకులు చేరవేయలేకపోయాయని తెలిపారు. పాత ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాల్లో సరుకుల రవాణా, లోడింగ్, అన్లోడింగ్ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు.
దీపావళి సీజన్లో ఈ మార్కెట్లన్నీ కలిపి సాధారణంగా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు వ్యాపారం చేస్తాయని బ్రిజేశ్ గోయల్ తెలిపారు. అయితే సభ కారణంగా దుకాణాలు తెరిచిన చోట్ల కూడా కొనుగోలుదారులు లేక అమ్మకాలు జరగలేదని చెప్పారు. వ్యాపారులకు జరిగిన నష్టానికి ఎవరు పరిహారం చెల్లిస్తారని, సభ నిర్వాహకులే బాధ్యత తీసుకుంటారా అని ప్రశ్నించారు. ధన్‌తేరస్‌కు నాలుగు రోజుల ముందు ఈ పరిస్థితి ఏర్పడటం వ్యాపార రంగానికి పెద్ద దెబ్బగా మారిందన్నారు.
Also Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న
రాంలీలా మైదాన్‌లో దీపావళి షాపింగ్ సీజన్ సమయంలో సభ నిర్వహించడంపై ఢిల్లీలోని పలు వ్యాపార సంఘాలు ముందుగానే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రాఫిక్ ఆంక్షలతో హోల్‌సేల్ మార్కెట్లు, రోజువారీ కూలీల జీవనోపాధిపై ప్రభావం పడుతుందని హెచ్చరించాయి.
మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఇండియా కూటమి రాంలీలా మైదాన్‌లో ఈ సభ నిర్వహించింది.

