కాంగ్రెస్ ర్యాలీ.. బీఎస్-6 వాహనాల తనిఖీలు

3
- Advertisement -

ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం జరిగిన ఇండియా కూటమి భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి. అయితే అదే రోజు నుంచి ఢిల్లీలో అమల్లోకి వచ్చిన వాయు కాలుష్య నియంత్రణ నిబంధనలు సభకు వచ్చిన వారికి ఇబ్బందులు సృష్టించాయి. బీఎస్-6 ప్రమాణాలు లేని వాహనాల ప్రవేశంపై ఢిల్లీ సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టగా.. గురుగ్రామ్ సరిహద్దులో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. మరోవైపు నోయిడా వైపు నుంచి వచ్చే వాహనాల విషయంలో కొంత సడలింపు కనిపించింది.

హర్యానా నుంచి ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టోల్ మార్గంలో ఢిల్లీలోకి ప్రవేశించేందుకు మధ్యాహ్నం సమయంలో ఏడు బస్సులతో పాటు కొన్ని ఎస్‌యూవీలు వరుసగా నిలిచాయి. వీటిలో స్కార్పియో, ఫార్చ్యూనర్ వంటి వాహనాలు కూడా ఉన్నాయి. కొత్త ఎస్‌యూవీలను పోలీసులు అనుమతించగా.. బీఎస్-6 ప్రమాణాలు లేని పాత బస్సులను అడ్డుకున్నారు. కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లు పట్టుకుని సుమారు 200 మంది ప్రయాణిస్తున్న బస్సులను నిలిపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు బస్సుల్లోని ప్రయాణికులను కిందకు దించడంతో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. బారికేడ్లను తొలగించి ‘ఓట్ చోర్.. గద్దీ చోర్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తనిఖీల పేరుతో తమను సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. బీఎస్-6 ప్రమాణాలు లేని కొన్ని బస్సులను ఉద్యోగ్ విహార్ మార్గం వైపు మళ్లించారు. దీంతో సభకు ఎలా చేరుకోవాలని ఓ వృద్ధ మహిళ పోలీసులను ప్రశ్నించారు.

Also Read:ఇట్లు అర్జున..నవంబర్ 13న

మరోవైపు ఢిల్లీ-నోయిడాను కలిపే చిల్లా సరిహద్దు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైతు సంఘాలు, పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తల బస్సులు ఢిల్లీలోకి ప్రవేశించాయి. అక్కడ తనిఖీల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఓ ఢిల్లీ పోలీసు అధికారి వెల్లడించారు.

ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నవంబర్ 1 నుంచి బీఎస్-6 కంటే తక్కువ ప్రమాణాలు కలిగిన ఇతర రాష్ట్రాల వాహనాల ప్రవేశంపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల మధ్య ఇండియా కూటమి సభ జరగడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యకర్తలు రవాణా పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

- Advertisement -