మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలెక్షన్‌లో పోటీ చేస్తున్నట్లు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. దీంతో టాలీవుడ్‌లో మా ఎన్నికల వ్యహారం చర్చాంశనీయంగా మారింది. (మా) ఎన్నికల్లో ‘సినిమా బిడ్డలు’ ప్యానల్ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్రకాష్ రాజ్‌కు షాకిచ్చిన వెంటనే బండ్ల గణేష్ మరో సంచలన ప్రకటన చేశారు. సినిమా బిడ్డల ప్యానల్‌లో అధికార ప్రతినిధి బాధ్యతలను నిర్వర్తించలేనని చెబుతూనే ఆ వెంటనే వరుస ట్వీట్లు చేశారు. ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
‘‘మాట తప్పను … మడమ తిప్పను. నాది ఒకటే మాట-ఒకటే బాట. నమ్మడం -నమ్మినవారికోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తాను. పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు. ఒకేఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా. నా పరిపాలన ఏంటో తెలియచేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా… వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. మాను బలోపేతం చేద్దాం. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం. అదే మా నిజమైన అభివృద్ధి… చిహ్నం – ఇట్లు మీ బండ్ల గణేష్’’ అంటూ వరుస ట్వీట్లు చేశారు.
బండ్ల గణేష్ ట్వీట్లను బట్టి చూస్తే ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఆయన పేరు లేకపోవడం మనస్తాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ‘సినిమా బిడ్డల’ ప్యానల్ నుంచి జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నారు.