భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. నేడు సంగారెడ్డి జిల్లా కంది శివారులోని హైదరాబాద్ ఐఐటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐఐటీలో కోర్సు పూర్తి చేసుకున్న 560 మంది విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు.
రాష్ట్రపతి అంతకుముందు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఐఐటీ పరిసరాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి చెన్నైకి బయల్దేరుతారు.
నిన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢిల్లీ నుంచి భారత వైమానిక దళ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనుటకు రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ దంపతులు ఘనస్వాగతం పలికారు.
వీరితోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కే.స్వామి గౌడ్ , రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ , టి. పద్మారావు గౌడ్ , పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు రాష్ట్రపతి స్వాగతం పలికారు.