ఉపధ్యాయులకు శుభవార్త..

197
President Approves Unified Teachers Service.
President Approves Unified Teachers Service.
- Advertisement -

ఇకపై పంచాయతీ రాజ్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులందరికీ ఒకేవిధమైన సర్వీస్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఉపాధ్యాయులందరికీ ఒకే రకమైన సర్వీస్‌ రూల్స్‌ కల్పించే ఈ దస్త్రానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్‌కి సంబంధించిన దస్త్రాన్ని న్యాయశాఖ క్లియర్ చేయడంతో కేంద్రహోం శాఖ కార్యదర్శి సంతకం పెట్టారు. ఈ ఫైల్‌ను ప్రధాని మోడికి పంపే ముందు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దీనికి సంబంధించి ప్రాముఖ్యతను తెలపడంతో వెంటనే పీఎంవో అధికారులు ఒక్కరోజులోనే ఫైలును క్లియర్ చేసి.. ప్రధానికి పంపగా ఆయన మంగళవారం సాయంత్రం లఖ్‌నవూ పర్యటనకు వెళ్లే ముందు సంతకం చేశారు. అనంతరం ఈ దస్త్రాన్ని రాష్ట్రపతి భవన్‌కు పీఎంవో అధికారులు పంపగా.. దీన్ని పరిశీలించిన రాష్ట్రపతి ఈ రోజు సంతకం చేశారు.

గతంలో కేంద్ర హోంశాఖ నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల సమావేశంలో ఉపాధ్యాయుల ఏకీకృతసర్వీసు నిబంధనలపై ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది.. తద్వారా 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరపడం జరిగింది. అయితే, ఇప్పటివరకు ఈ దస్త్రానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు ఆంగ్లంలోనే జరిగాయి. దాన్ని అధికార భాషతో పాటు అన్ని భాషల్లోకి తర్జుమా చేసిన అనంతరం సోమవారం తర్వాత అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.

- Advertisement -