లేటు వయసు వివాహం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. రకరకాల ఒత్తిళ్లతో కొంతమంది పెళ్లి లేటు వయసులో చేసుకుంటుండగా…మరికొంతమందికి మారుతన్న జీవన శైలీతో పిల్లలు పుట్టడంలో ఆలస్యమవుతోంది. ప్రతి మహిళా తల్లి కావాలని ఎలా ఆరాటపడుతుందో పుట్టే పిల్లలు తెలివైన వారై ఉండాలని అనుకుంటుంది. పిల్లలు పుట్టడంలో ఆలస్యమైతే వారి మిగితా జీవితంపై ప్రభావం చూపుతుందా అనే అంశంపై పరిశోధకులు చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
సౌతర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన పరిశోధనలు ఇందుకు భిన్నమైన నిజాల్ని వెలికి తీసాయి.లేటు వయసులో గర్భం దాలిస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ, 35 ఏళ్లు దాటిన తర్వాత చివరి సంతానం కలిగిన స్త్రీలలో మెరుగైన మేధోశక్తి ఉంటున్నట్లు వారు కనుగొన్నారు. పదేళ్లపాటు హార్మోనల్ గర్భనిరోధక మాత్రలు వాడినవారిలోనూ ఈ పరిణామాలు ఉంటున్నాయి.
24 ఏళ్లు ఇంకా ఎక్కువ వయసులో తొలిసారి గ ర్భవతులైన వారిలో కూడా నిర్వహణా పటిమ, ఏకాగ్రత, వృత్తిపరమైన జ్ఞాపకశక్తి, హేతుబద్ధత, సమస్యా పరిష్కార సామర్థ్యం మెరుగ్గా ఉంటున్నట్లు పరిశోదనల్లో వెల్లడైంది. ఈ దశల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు చైతన్యవంతంగా ఉండడమే ఇందుకు కారణం. సహజంగా ఈస్ట్రోజన్ హార్మోన్లు మెదడు రసాయన శక్తిని, పనితనాన్నీ, అస్థిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. ప్రొజెస్టరాన్ హార్మోన్లేమో మెదడు కణజాలపు ఎదుగుదలకు, దాని వృద్దికి తోడ్పడతాయి. లేటు వయసులో గర్భం దాల్చిన స్త్రీలలో ఈ హార్మోన్లు ఎక్కువ చైతన్యవంతంగా ఉండడం వారికి అదనపు ప్రయోజనలు కలుగుతున్నాయి.
అలాగే గర్భధారణకు ముందు 13 ఏళ్ల పాటు రుతుక్రమం కొనసాగిన వాళ్లలోనూ ఈ మేధోశక్తి మెరుగ్గా ఉంటున్నట్లు వారు కనుగొన్నారు. అయితే ఈ పరిశోధనల అర్థం 35 ఏళ్లు వచ్చేదాకా స్త్రీలు గర్భధారణ కోసం వేచి ఉండాలని కాదు. ఏ కారణంగానైనా సంతానం కలగడంలో ఆలస్యమైతే అందులోనూ కొన్ని సానుకూల అంశాలే ఉంటున్నాయని చెప్పడమే దీని అంతరార్థం. అందుకే సంతానం కలగడంలో కాస్త ఆలస్యం కాగానే విపరీతంగా ఆందోళన పడాల్సిన అవసరమేమీ లేదని సర్వే ద్వారా తేలింది.