నీట్-యుజి (NEET-UG 2026) క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై జన్ సూరాజ్ అధినేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఎన్‌టీఏ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. లీక్ పరిధి ఎంత అనేదానితో సంబంధం లేకుండా, అది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాట్నాలో విలేకరులతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వైఖరిని తప్పుపట్టారు. “పరీక్షలో ఒక్క ప్రశ్న లీకైనా, లేదా ఐదు ప్రశ్నలు లీకైనా.. దాన్ని పేపర్ లీక్‌గానే పరిగణించాలి. ఎంతో కష్టపడి రాత్రింబగళ్లు చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ ఉదంతం గందరగోళంలోకి నెట్టేసింది” అని కిషోర్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను అధికారికంగా రద్దు చేసిన తర్వాత, ఇంకా ఎన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయనే దానిపై చర్చలు జరపడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. పరీక్ష క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, ఎన్‌టీఏ సమర్థించుకోవడానికి ప్రయత్నించడం వ్యర్థమని పేర్కొన్నారు.
మరోవైపు ఎన్‌టీఏ డీజీ అభిషేక్ సింగ్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇస్తూ.. ఎన్‌టీఏ వ్యవస్థ లోపాల వల్ల ఈ లీకేజీ జరగలేదని సమర్థించుకున్నారు. క్వశ్చన్ పేపర్ లీకేజీ సర్క్యులేషన్ వెనుక ఉన్న అసలు కారణాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణ జరుపుతోందని తెలిపారు. అక్రమాలకు తావులేకుండా ఉండేందుకే తాము జీరో టాలరెన్స్ విధానంతో పరీక్షను రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే వచ్చే ఏడాది నుంచి నీట్-యుజి (NEET-UG) పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT Format) నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read:చిన్నతనంలో జంక్ ఫుడ్..షాకింగ్!
మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాలతో పాటు 14 అంతర్జాతీయ కేంద్రాలలో జరిగిన నీట్-యుజి 2026 పరీక్షకు దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ లీక్ వివాదంతో రద్దయిన ఈ పరీక్షను కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జూన్ 21న తిరిగి నిర్వహించనున్నారు.

