పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్‌ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, చిన్నతనంలో అలవాటయ్యే ఈ జంక్ ఫుడ్ కేవలం ఊబకాయం ,వారి మెదడు నిర్మాణాన్ని జీవితాంతం మార్చేస్తుందని తాజా శాస్త్రీయ పరిశోధన హెచ్చరిస్తోంది. పెద్దయ్యాక ఆరోగ్యకరమైన ఆహారానికి మారినప్పటికీ, చిన్నతనంలో తిన్న జంక్ ఫుడ్ వల్ల మెదడుకు జరిగిన నష్టాన్ని పూడ్చలేమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ అధ్యయనం ప్రకారం.. చిన్నతనంలో ఎక్కువ కొవ్వులు, చక్కెరలు ఉండే జంక్ ఫుడ్ తినడం వల్ల మెదడులోని ‘హిప్పోకంపస్’ అనే భాగం తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడులోని ఈ భాగమే మన జ్ఞాపకశక్తికి , నేర్చుకునే సామర్థ్యానికి అత్యంత కీలకం.పరిశోధకులు తమ అధ్యయనంలో జంక్ ఫుడ్ తినే పిల్లల మెదడులో ‘ఎసిటైల్కోలిన్’ అనే కీలకమైన న్యూరోట్రాన్స్మిటర్ (రసాయనం) స్థాయిలు పడిపోతున్నట్లు గుర్తించారు.
ఈ రసాయనం మనకు విషయాలు గుర్తుండటానికి, ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది. ఈ రసాయన లోపం ఏర్పడినప్పుడు మెదడులోని సంకేతాల వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి మందగించడం, విషయాలను త్వరగా మర్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
ఈ పరిశోధనలో తేలిన అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. చిన్నతనంలో జంక్ ఫుడ్ తిన్న వారు, పెద్దయ్యాక బుద్ధిగా పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ, వారి మెదడులో ఎసిటైల్కోలిన్ స్థాయిలు మళ్లీ పెరగలేదు. అంటే, చిన్నతనంలో జంక్ ఫుడ్ వల్ల మెదడుకు జరిగిన డ్యామేజ్ జీవితాంతం అలాగే ఉండిపోతుంది.
Also ead:త్వరలో మెడికల్/ఇంజనీరింగ్‌లకు ఒకే పరీక్ష
పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందే వయసులో వారికి ఇచ్చే ఆహారం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్ కేవలం శరీర బరువునే కాదు, వారి ఆలోచనా శక్తిని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇప్పటికైనా పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.

