ఓటు చోరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన సౌరభ్, అశోక్, నేహా బోరా, దీపికలను విడుదల చేసే సమయంలో వారితో బలవంతంగా పీస్ బాండ్లపై సంతకాలు చేయించడంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. న్యాయం కోసం గొంతెత్తుతున్న వారిని అణచివేసే ప్రయత్నాలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
నిరసనకారుల వయసును న్యాయమూర్తి ప్రశ్నించడం, వారిని చిన్న పిల్లల మాదిరిగా పరిగణించడం ఏమిటని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. యువత చేస్తున్న నిరసనలను తక్కువగా చూడకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను యువత ఎప్పటికీ మర్చిపోదని వ్యాఖ్యానించారు. ఈ అన్యాయంపై నిరసనకారులు మరోసారి ఏకమవుతారని స్పష్టం చేశారు.
ఈ నిరసనలు ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా రైతులు, పౌర సమాజ ప్రతినిధులు, రచయితలు నిరసనలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వివిధ వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:లిక్కర్ ఎంత తాగితే మంచిది?
ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత ఉండాలని, ఓట్ల చోరీకి అడ్డుకట్ట వేయాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని, ఈవీఎంలను రద్దు చేయాలని కోరారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

