మద్యం తాగడానికి సురక్షితమైన పరిమాణం ఏదైనా ఉందా? అనే దానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం ఉండదు? పూర్తిగా ఎలాంటి ప్రమాదం లేని మోతాదు అంటూ ఏదీ లేదని నిపుణులు చెబుతున్నారు. బీర్, వైన్ లేదా ఇతర మద్యం ఏదైనా సరే.. శరీరంలోకి వెళ్లిన తర్వాత కణాలకు నష్టం కలిగించి, కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును పెంచే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
బీర్, వైన్ లేదా ఇతర మద్యం ఏ రూపంలో తీసుకున్నా.. కాలేయం దానిని మొదట ఎసిటాల్డిహైడ్గా, ఆ తర్వాత అసిటేట్గా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.వీటిలో ఎసిటాల్డిహైడ్ శరీర కణాలకు హాని కలిగించే విషపూరిత పదార్థమని ఆయన పేర్కొన్నారు. ఇది డీఎన్ఏను దెబ్బతీయడంతో పాటు దానికి జరిగిన నష్టాన్ని శరీరం సరిచేసుకునే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని వివరించారు.
మద్యం క్యాన్సర్కు కారణమయ్యే పదార్థాల జాబితాలో గ్రూప్-1 కార్సినోజెన్గా వర్గీకరించబడటానికి ఇదొక ముఖ్యమైన కారణమని ఆయన చెప్పారు. మద్యం తీసుకునే పరిమాణం పెరిగే కొద్దీ కొన్ని ఆరోగ్య సమస్యల ముప్పు కూడా పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల విషయంలో ప్రమాదం పూర్తిగా తొలగిపోయే మద్యపాన పరిమాణాన్ని పరిశోధనలు నిర్ధారించలేదని ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్లపాటు జరిగిన కొన్ని పరిశీలనాత్మక అధ్యయనాల్లో మితంగా మద్యం తాగే వ్యక్తులు, అసలు మద్యం తాగని వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు కనిపించింది. దీంతో పరిమితంగా మద్యం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే అభిప్రాయం ఏర్పడింది.
అయితే ఈ అధ్యయనాల్లో మద్యం తాగని వారిని వర్గీకరించిన విధానంలో కొన్ని లోపాలు ఉండవచ్చని…అనారోగ్యానికి గురైన తర్వాత మద్యం మానేసిన వ్యక్తులను కూడా మద్యం తాగని వారి సమూహంలో చేర్చడం వల్ల ఫలితాలు ప్రభావితమై ఉండవచ్చని తెలిపారు.అంటే ఇప్పటికే ఆరోగ్య సమస్యలు రావడంతో మద్యం మానేసిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి కారణంగా, మద్యం తాగని వారందరూ తక్కువ ఆరోగ్యంతో ఉన్నట్లు అధ్యయనాల్లో కనిపించే అవకాశం ఉంది. దీనివల్ల మితంగా మద్యం తాగడం వల్లే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయనే తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు.
మద్యం తాగడం అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఈ విషయాన్ని చెప్పడం వెనుక ఎవరి ఎంపికలను విమర్శించాలనే ఉద్దేశం లేదని కానీ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు. ఆరోగ్య పరంగా చూస్తే ఎక్కువ మద్యం తీసుకోవడంతో పోలిస్తే తక్కువ తీసుకోవడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని, అసలు మద్యం తీసుకోకపోవడమే ఈ ముప్పులను తగ్గించే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read:ఎమ్మెల్యే వివేకా బర్త్ డే..గ్రీన్ ఛాలెంజ్
అయితే అన్ని మోతాదుల్లో మద్యం ఒకే స్థాయిలో ప్రమాదకరమని దీని అర్థం కాదు. మద్యం తీసుకునే పరిమాణాన్ని బట్టి ప్రమాద స్థాయి మారవచ్చు. కానీ పూర్తిగా ప్రమాదరహితమైన మద్యపాన పరిమాణం ఉందని నిర్ధారించే ఆధారాలు లేవన్నది ఆయన ప్రధాన సందేశం.

