వరంగల్ బీజేపీ సభ పై, ఆ సభలో మాట్లాడిన బీజేపీ నేతల తీరుపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు చిల్లరగా ఉందన్నారు. అబద్ధాలు వల్లించారని, ఈ సభతో బీజేపీ వైఖరి మరోసారి స్పష్టమైందని అన్నారు. వరంగల్‌లో నడ్డా సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్న ఆయన.. ఎందుకు చేస్తున్నరో తెలియని, ప్రజా సంగ్రామ యాత్ర 3వ విడత ముగింపు సభ జనం లేక వెలవెల బోయిందన్నారు. ఎలాగైనా సభను నింపేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాన్ని పిలిపించారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ఈ సభలో కూడా అవే పాత బెదిరింపులు చేశారని విమర్శించారు. వారి సభను అడ్డుకుంటే ప్రభుత్వానికే ముప్పు అట? ఇదేం హెచ్చరిక? ఏం మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. నడ్డా ప్రసంగం అంతా పాత చింతకాయ పచ్చడి ప్రసంగమేనన్నారు. ‘‘తెలంగాణకు విముక్తి కలిస్తామని అన్నాడు. అయ్యా! నడ్డా గారు.. మేం ఆల్ రెడీ ప్రజల మద్దతుతో ఉద్యమించి, తెలంగాణను విముక్తం చేసుకున్నాం. ఇక జరగాల్సింది బిజెపి విముక్త భారతం. ప్రజలు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అందుకే మీరు ఈ మత చిచ్చులు పెట్టి ప్రజల్ని చీల్చుతున్నారు’ అంటూ దుయ్యబట్టారు.
కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేత. అంటే మత చిచ్చులు పెట్టి, ప్రజలను విడగొట్టి, చిల్లర రాజకీయాలు చేసి, పచ్చని తెలంగాణలో బీజేపీ మంటలు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? కేంద్రం డబ్బులిస్తే కేసీఆర్ ఖర్చు చేయడం లేదట! కేంద్రం ఇచ్చిందేంది? మీరు తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలి. ఇంకా మా పన్నుల రూపంలో ఇచ్చిన కోట్లను కొల్లగొట్టి, మాకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టి అబద్ధాలు చెబుతున్నారు. అసలు మీ నయా పైసా లేకుండానే మేం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నం. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా ఇస్తున్నం. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను బాగు చేసుకున్నం. పెన్షన్లు కూడా మీరు ఇచ్చేది ఎంత? కేవలం రూ.215కోట్లు ఇస్తుంటే మేం ఏడాదికి 12 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నం. మీరేక్కడైనా ఇస్తున్నరా?’’ అని నిలదీశారు.
సీఎం కేసీఆర్‌ని ఇంట్లో కూర్చోబెట్టాలని నడ్డా చెప్పడంపై మండిపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ‘ఎందుకు? అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపినందుకా? కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీయంగా మారిందని చెప్తున్నారు. అరిగిపోయిన రికార్డు అది. జనం ఇట్లాంటి మాటలు వినడానికి సిద్ధంగా లేరు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం జైలుని కూల్చారు. 11 వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నం. అక్కడ పనులు నడుస్తున్నయి. 70 శాతం రాఫ్ట్ (పునాది) పూర్తయింది. 20 శాతం గ్రౌండ్ లేవెల్ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా 15శాతం పనులు పూర్తి అయినట్లు మీరు చూస్తే కదా తెలిసేది? అభివృద్ధిని చూసే దమ్ము బీజేపీకి లేదు. బీజేపి వాళ్ళు కండ్లున్నా చూడలేని కబోదులు. కేంద్రం రాష్ట్రానికి మరియు వరంగల్‌కు ఇచ్చిన నిధుల మీద కిషన్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెప్పారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ.450 కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రానికి రావాల్సింది రూ.3వేల 600 కోట్లు. కానీ, రాష్ట్రానికి ఇచ్చింది రూ.వెయ్యి 916 కోట్లు మాత్రమే. నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19వేల 205 కోట్లు విడుదల చేయాలి. ఇచ్చారా? ఇవ్వలేదు. ముస్లింలకు 12శాతం, ఎస్టీలకు 10శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లులు ఎందుకు మీ దగ్గరే పెట్టకున్నారు? వరంగల్ టెక్స్టైల్ పార్కు కోసం రూ.వెయ్యి కోట్ల రూపాయలను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇవ్వాలి.. ఇచ్చారా? వరంగల్‌కు అమృత్ స్కీం కింద మీరిచ్చిన నిధులు కేవలం రూ.359 కోట్లు మాత్రమే. అదే మిషన్ భగీరథను రాష్ట్రంలో రూ.46 వేల కోట్లతో చేపట్టినం. 40వేల కోట్ల రూపాయలతో పూర్తి చేసి, ఇంటింటికీ నీరు ఇస్తున్నం.
అలాంటి మిషన్ భగీరథకు నయా పైసా అయినా కేంద్రం ఇచ్చిందా? పని మొదలు పెట్టని ఉత్తర ప్రదేశ్, కొద్దిపాటి పని చేసిన గుజరాత్‌కి కోట్లు ఇచ్చారు. తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? వరంగల్‌లో ఒక్క సీఎం హామీల కింద రూ.600 కోట్లు ఖర్చు చేసినం. మొత్తంగా రూ.2వేల 500 కోట్లతో గడిచిన కొద్ది కాలంలోనే వరంగల్ని అభివృద్ధి పరచినం. ఇంతా చేస్తే స్మార్ట్ సిటీ కింద రూ.83కోట్లు ఇస్తామని చెప్పి, మీరిచ్చింది రూ.42 కోట్లు మాత్రమే. విభజన హామీలకు తూట్లు పొడిచారు. మా గిరిజన విశ్వవిద్యాలయం ఏమైంది? మా కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? బయ్యారం ఉక్కు ఎక్కడికి పోయింది? మెడికల్ కాలేజీలు, ఐటీ హబ్‌లు ఏ ఒక్కటైనా తెలంగాణ కిచ్చారా? తెలంగాణకు ఏమిచ్చారు? తెలంగాణకు బీజేపీ ఎంపీలు తెచ్చింది ఏంలేదు. కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదు.
ఒక్కటైనా మేమిది తెచ్చామని మీరు చెప్పగలరా? మొత్తంగా రాష్ట్రానికి రావాల్సిన రూ.7,184 కోట్లను కేంద్రం ఇవ్వడం లేదు. జీఎస్టీ పరిహారం రూ.2,247 కోట్లు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1103 కోట్లు ఎప్పుడు ఇస్తారు? 2014-15 నుంచి నేటి వరకు రూ.3,65,797 కోట్లు చెల్లిస్తే, రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 2,68,647 కోట్లు మాత్రమే! జీఎస్టీ పన్నులు అయితే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందని, 26.9 శాతానికి కుదించి, సెస్సు ల రూపంలో రాష్ట్రాల నుంచి డబ్బులు గుంజుతుంది కేంద్రం కాదా? 15వ ఆర్థిక సంఘం తప్పు పట్టినా సిగ్గులేని ప్రభుత్వం మీది. దమ్ముంటే, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చినదెంత? రాష్ట్రం నుండి కేంద్రం కొల్లగొట్టింది ఎంత? లెక్క చేద్దామా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మా లాంటి పథకాలు అమలు అవుతున్నాయా?
తెలంగాణలో జరిగిన అభివృద్ధి, మీరు అధికారుంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి మీద చర్చ చేద్దామా? బండి సంజయ్ తొండి సంజయ్, కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రి అయ్యుండి అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా? నడ్డా మాట్లాడితే, ఎవరూ పట్టించుకోలేదు. ఆయన మాటకు విలువలేదు. గట్టిగా మాట్లాడితే కేసులంటారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలుస్తారు. ఇదేనా మీ పాలన? ప్రజలకు మీ అసలు రంగు తెలిసింది. మీ పాలన కాలం తీరే రోజులు దగ్గర పడ్డాయి. సీఎం దాకా ఎందుకు? మా కార్యకర్తలు చాలు నీకు’ అంటూ విమర్శల వర్షం కురిపించారు మంత్రి. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే రమేశ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు నాగూర్ల వెంకన్న, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.