కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా..

35
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. జనగామ బీఆర్ఎస్ టికెట్ కూడా ఇస్తారని టాక్ నడుస్తోంది.

ఇక 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు పొన్నాల. కాంగ్రెస్‌లో బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందించారు.

పార్టీలో తనకు అవమానం జరిగిందని తెలిపారు. కొంతమంది ఒంటెద్దు పొకడలతో పార్టీకి నష్టం జరుగుతోందని..ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పిన ప్రయోజనం లేకపోయిందన్నారు.

Also Read:‘లియో’లో ‘కోబ్రా’గా చరణ్..!

బీసీ సామాజిక వర్గానికి కనీసం 48 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని పొన్నాల లక్ష్మయ్య కోరుతున్నారు. ఈ విషయమై పార్టీ నాయకత్వంపై ఆయన ఒత్తిడి తీసుకువస్తున్నారు. అయితే దీనిని పట్టించుకునే పరిస్థితిలో లేదు కాంగ్రెస్. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేశారు.

2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ ఓడిపోయింది.2018లో కూడా ఒడిపోయింది కానీ అప్పటినాయకులను రాజీనామా చేయమని అడగలేదన్నారు.తనను మాత్రం బలిపశువుని చేశారన్నారు. ఇక లేఖలో రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా జరుగుతోందని…పార్టీలోనే పరాయివాళ్లయ్యామన్నారు. నాలాంటి సీనియర్ నేత మాట్లాడాలంటే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లు భూములు, విల్లాలు తీసుకుని టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో పార్టీని అమ్మకానికి పెట్టారన్నారు.బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ భావజాలం అంటే తెలియని వ్యక్తి చేతుల్లో పార్టీ ఉందని చెప్పారు. రెండేళ్లుగా తాను ఎన్నో అవమానాలు పడ్డానని చెప్పారు. బీసీ నాయకులకు పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని…సర్వేల పేరుతో బీసీ నాయకుల గొంతు కొస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ మూల సిద్దాంతం సామాజిక న్యాయానికి తూట్లు పొడిచారన్నారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు.

- Advertisement -